Leading News Portal in Telugu

TS Govt: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. వీవోఏల గౌరవం వేతం పెంపు..


ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ)లో విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌ (వీవోఏ)లుగా పని చేస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీవోఏల గౌరవ వేతనం పెంచుతూ కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు జీవో జారీ అయింది. యూనిఫాం కోసం నిధుల విడుదలకు.. రెనివల్ విధాన సవరింపునకు.. సీఎం అంగీకారం తెలిపారు.

జీవిత బీమా అమలు చేయాలనే విజ్జప్తికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఇందుకు సబంధించి మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశమై ప్రకటించాలని మంత్రి హరీశ్ రావుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశాడు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతీ రాథోడ్ లతో కలిసి మహిళా సంఘాల సహాయకులతో మంత్రి హరీశ్ రావు సమావేశమైయ్యారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలు వారికి ఆయన వెల్లడించారు. జీతాలు పెంచుతూ జారీ అయిన ప్రభుత్వ ఉత్తర్వులు.. మహిళా సంఘాల ప్రతినిధులకు ఉత్తర్వుల కాపీని మంత్రులు అందజేశారు.

అయితే, ప్రస్తుతం వీవోఏలకు రూ. 3,900 గౌరవ వేతనం ఇస్తుండగా.. దానిని రూ. 5 వేలకు పెంచుతూ ఉత్తర్వులు వెల్లడించారు. దీంతో అదనపు సాయం రూ. 3 వేలు కలిపి వీవోఏలు నెలకు 8 వేల రూపాయలు అందుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 17 వేలకు పైగా వీవోఏలకు లబ్ది పొందనున్నారు. ఇక, గత కొంతకాలంగా తమ గౌరవ వేతనం పెంచాలి.. సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి రూ. 26 వేలు చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని వీవోఏలు డిమాండ్ చేశారు. 20 ఏళ్లు వీవోఏలుగా పనిచేస్తున్న రూ. 3,900 ఇస్తూ.. 20 రకాల పనులు చేయిస్తున్నారని, శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని వీవోఏలు ఆరోపించారు.