Ritu Sahu Incident: విశాఖపట్నంలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని రీతి సాహ కేసు సంచలనం రేపుతోంది. జూలై 14వ తేదీన భవనంపై నుంచి కిందపడి రీతి సాహా ప్రాణాలు కోల్పోయింది. నీట్ శిక్షణ కోసం కోల్‌కత్తా నుంచి విశాఖపట్నం వచ్చి చదువుకుంటున్న రీతి సాహా వ్యవహారం మిస్టరీగా మారింది. కేసు దర్యాప్తును స్థానిక పోలీసులు తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ విద్యార్ధిని తల్లిదండ్రులు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఫిర్యాదు చేయడంతో అక్కడి పోలీసులు కేసులు నమోదు చేశారు. విద్యార్దిని ఆత్మహత్య వ్యవహారంలో ఏపీ పోలీసుల వైఖరిపై విద్యార్ధిని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేయడం, బెంగాల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే వెస్ట్ బెంగాల్ మైనర్ బాలిక కేసులో తాజాగా కొత్తట్విస్ట్ తెరపైకి వచ్చింది. విద్యార్థిని రీతి సాహా ఆసుపత్రిలో ఉన్న వీడియో బయటపడింది. హాస్టల్ బిల్డింగ్ నుంచి కిందపడిన తర్వాత బాలికను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చింది యాజమాన్యం. దీంతో బాలిక తల్లిదండ్రుల ఆరోపణలకు రోజు రోజుకి బలం పెరుగుతోంది.
రీతి సాహా అత్మహత్య కేసులో బెంగాల్ ప్రభుత్వం ఒత్తిడితో దర్యాప్తు అధికారులపై ఇప్పటికే వేటు పడింది. సీఐ, ఎస్సైలను ఏపీ ప్రభుత్వం వీఆర్‌కు పంపింది. జులై 12న హాస్టల్ భవనంపై నుంచి కిందపడి రీతి సాహా గాయపడింది. సీసీటీవీల్లో విద్యార్ధిని పైకెళ్లేపుడు ఒక డ్రెస్ ధరించి ఉండగా.. భవనంపై నుంచి కిందపడిన సమయంలో మరో డ్రెస్‌లో ఉంది. విద్యార్ధిని తల్లిదండ్రులు బెంగాల్ నుంచి వచ్చేసరికి పోస్టుమార్టం పూర్తి చేయడం, వారి నుంచి విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్నట్లు సంతకాలు చేయించడంపై విద్యార్ధిని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆకాష్ బైజూస్‌లో నీట్ శిక్షణ పొందుతున్న బాలిక అనుమానస్పద స్థితిలో చనిపోవడం కేసును తారుమారు చేయడానికి పోలీసులు ప్రయత్నించడంతో ఏమి జరిగిందనే దానిపై విచారణ మొదలైంది.
బాలిక మృతిపై అనుమానాలు పెరుగుతున్నాయి. బాలిక ఒంటిపై బలమైన గాయాలు కనిపించలేదు. సీసీ ఫుటేజ్‌లో టైమింగ్ మొదటి నుంచి మిస్టరీగా మారింది. ఇప్పుడు రీతు ఒంటిపై బలమైన గాయాలు లేకపోవడం, మృతికి దారి తీసిన కారణాలపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చికిత్స చేస్తున్న సమయంలో ఆస్పత్రిలోని వైద్యులకు ఏం చెప్పిందో అన్న దానిపై దర్యాప్తు కొనసాగుతుంది. విశాఖలో ఇప్పటికే వెస్ట్ బెంగాల్ పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గురువారం విశాఖపట్నం సాధన ఆస్పత్రిలో పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో భవనం పైనుంచి దూకిన తర్వాత రీతి సాహా బతికే ఉన్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. చనిపోవడానికి ముందు బాలికను హాస్టల్ సమీపంలో ఉన్న వెంకటరామ ఆస్పత్రికి తరలించినట్లు గుర్తించారు. ఆ సమయంలో ఆమె స్పృహలోనే ఉంది. బాలిక ఒంటిపై గాయాలు లేకపోయినా అంతర్గత అవయవాలు దెబ్బతిని ఉంటాయని అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇరు రాష్ట్రాల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.