విదేశీ పర్యటనకు జగన్.. 10 రోజులు సీఎం లేకుండా పరిపాలన! | jagan to foriegn tour| 10days| ap| rule| with| out| cm| uk
posted on Sep 1, 2023 6:47AM
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. పది రోజుల పాటు సీఎం కుటుంబంతో కలిసి ఫారిన్ టూర్ వెళ్లనున్నారు. సీఎంగా జగన్ గత ఏడాది విదేశీ పర్యటనకు వెళ్లారు. పెట్టుబడుల సదస్సు కోసం ఆయన అప్పట్లో మంత్రి వర్గంలోని కీలక మంత్రులను, ఉన్నతాధికారులను దావోస్ తీసుకుని వెళ్లారు. మొత్తం పది రోజుల పాటు జగన్ విదేశీ టూర్ అప్పట్లో సాగింది. ఇక సీఎం కాకముందు కుటుంబంతో కలిసి ఇలాగే విదేశీ యాత్రలకు వెళ్లేవారు. గతంలో జగన్ పారిస్, డెట్రాయిట్, దావోస్, డల్లాస్ పర్యటనకు వెళ్లగా ఇప్పుడు యూకే వెళ్లనున్నారు. అక్రమాస్తులకు సంబంధించి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సీఎం జగన్ విదేశీ పర్యటన కోసం మూడు రోజుల క్రితం తెలంగాణలోని సీబీఐ కోర్టులో అనుమతి కోరారు.
అవినీతి కేసులలో ఆయన ప్రస్తుతం బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే. కాగా దేశం విడిచి వెళ్ళరాదని బెయిల్ షరతులు ఉండడంతో వాటిని సడలించి తాను విదేశాలు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ పిటిషన్‌లో కోరారు. బెయిల్ ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని కోర్టు సీబీఐని కోరగా.. ముందుగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు కొద్దిగా సమయం కావాలని సీబీఐ తెలిపింది. అనంతరం జగన్ విదేశీ పర్యటనలపై సందేహలున్నాయని, సాక్ష్యాలను తారుమారు చేస్తారని, సాక్షులను బెదిరిస్తారనే అనుమానాలు ఉన్నాయని.. అందుకే అనుమతి ఇవ్వవొద్దని సీబీఐ వాదనలు చేసింది. అయితే, సీబీఐ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. జగన్ విదేశీ పర్యటనకు అనుమతి మంజూరు చేసింది. దీంతో సీఎం జగన్ రెడ్డి శనివారం (సెప్టెంబర్ 2) నుంచి పది రోజుల పాటు యూకేకు వెళ్తారు.
కాగా.. సీఎం జగన్ తో పాటు అదే అక్రమ ఆస్తుల కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న ఎంపీ విజయసాయి రెడ్డి కూడా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరగా.. ఆయనకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. ఇక విజయసాయిరెడ్డి విదేశీ పర్యటన విషయానికి వస్తే ఈయన యూకే, యూఎస్ఏ, జర్మనీ, దుబాయ్, సింగపూర్ లో పర్యటించనున్నారు. విదేశీ యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం ఆరు నెలల్లో ఎప్పుడైనా విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి కోరగా కోర్టు అందుకు అనుమతి ఇవ్వడం విశేషం. అక్రమాస్తుల కేసులలో బెయిల్ షరతుల్లో భాగంగా ఈ ఇద్దరి పాస్ పోర్టులు అప్పుడు కోర్టుకు సరెండర్ చేయగా.. ఇప్పుడు కోర్టు అనుమతితో ఆ రెండు పాస్ పోర్టులు వీరికి అప్పగించనున్నారు. పర్యటన పూర్తి కాగానే మళ్ళీ తిరిగి కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది.
విజయసాయి రెడ్డి విదేశాలకు ఎప్పుడు వెళ్తారో షెడ్యూల్ ఖరారు కాలేదు కానీ, సీఎం జగన్ మాత్రం శనివారం(సెప్టెంబర్ 2) ప్రయాణం కానున్నారు. ఆ రోజు తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి ఉండడంతో జగన్ ఇడుపులపాయకు వచ్చి నివాళి అర్పిస్తారు. అక్కడ నుంచే నేరుగా ఆయన లండన్ టూర్ కి బయల్దేరి వెళ్తారు. విదేశాలలో చదువుకుంటున్న తన ఇద్దరు కుమార్తెలను చూసేందుకే జగన్ ఈ టూర్ పెట్టుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే, మొత్తం పది రోజుల పాటు సీఎం రాష్ట్రంలో లేకుండానే రాష్ట్ర పరిపాలన సాగనుంది. వర్చువల్ విధానం ద్వారా అక్కడ నుండే పరిపాలన సాగిస్తారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో సీఎం విదేశీ యాత్రకు వెళ్ళినపుడు కూడా ఇలాగే పరిపాలన సాగగా.. ఇప్పుడు కూడా అలాగే ప్రభుత్వాన్ని నడిపించనున్నారు.