Petrol Prices: దాయది దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. విదేశీ మారకద్రవ్యం నిలువలు పడిపోవడం, అప్పులు, ద్రవ్యోల్భణం, రాజకీయ అస్థిరత ఇలా అన్ని సమస్యలు ఆ దేశాన్ని చుట్టుముట్టాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) నుంచి అప్పు తీసుకున్న పాక్ నానా తిప్పలు పడుతోంది. ఐఎంఎఫ్ షరతులకు తలొంచుతోంది.
ఇదిలా ఉంటే ఆ దేశంలో ఇప్పటికే కరెంట్ బిల్లుల పెరుగుదల ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణం అవుతోంది. ప్రస్తుతం ఆ అక్కడ పెట్రోల్, డిజిల్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. పాక్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా లీటర్ పెట్రోల్, డిజిల్ రేట్లు రూ. 300ను దాటాయి. అక్కడి ఆర్థిక మంత్రిత్వ శాఖ నిన్న సాయంత్రం పెట్రోల్ ధర రూ. 14.91, హై-స్పీడ్ డీజిల్ (HSD) ధర రూ. 18.44 పెంచినట్లు ప్రకటించింది. దీంతో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 305.36 వద్ద ఉండగా, డీజిల్ ధర రూ.311.84కి చేరుకుంది.
పాకిస్తాన్ ఒక దేశంగా ఏర్పడినప్పటి నుంచి ఎప్పుడూ చూడని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందడి. ఇటీవల ఆ దేశం చేపడుతున్న ఆర్థిక సంస్కరణలు ద్రవ్యోల్భణ పెరుగుదల, అధిక వడ్డీ రేట్లకు దారి తీశాయి. దీంతో సాధారణ ప్రజలు, వ్యాపారాలపై ఒత్తిడి పెరిగింది. పాకిస్తాన్ రూపాయి విలువ నిరంతరం తగ్గుముఖం పడుతోంది. దీంతో సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచాల్సి వస్తోంది. దేశ కరెన్సీ యూఎస్ డాలర్ తో పోలిస్తే రికార్డు స్థాయిలు 305.6 వద్ద ట్రేడ్ అవుతోంది.
జాతీయ అసెంబ్లీ ఐదేళ్ల కాలపరిమితి పూర్తికావడంతో ఇటీవల తాత్కాలిక ప్రధానిగా అన్వర్ ఉల్ హక్ కాకర్ ని నియమించబడ్డాడు. ఎన్నికల వరకు దేశాన్ని నడిపించాల్సిన బాధ్యత ఆయనపై పడింది. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్, పాలనలో సైన్యం అధికంగా జోక్యం చేసుకోవడం అక్కడి పరిపాలను మరింత దిగజార్చింది.