మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్.. విడుదల | former minister ayyannapatrudu arrest| tdp| senior| leader| ycp| mla| perninani| complaint| gannavaram| yuvagalam| comments
posted on Sep 1, 2023 12:16PM
మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడిని పోలీసులు అరెస్టు చేశారు. హస్తిన నుంచి విశాఖ చేరుకున్న ఆయనను కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఇటీవల గన్నవరంలో జరిగిన యువగళం సభలో అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి, మంత్రులపై విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ అరెైస్టు జరిగింది.
సీఎం జగన్, మంత్రులను అవమానించేలా అయ్యన్న ప్రసంగం ఉందంటూ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కృష్ణా జిల్లా పోలీసులు అయ్యన్న పాత్రుడిని విశాఖ విమానాశ్రయం వద్ద అదుపులోనికి తీసుకున్నారు.
ఐపీసీ 153ఏ, 354, 504, 505(2), 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. కాగా అదుపులోనికి తీసుకున్న అయ్యన్న పాత్రుడికి 41ఎ కింద నోటీసులు ఇచ్చి యలమంచిలి సమీపంలో విడుదల చేశారు. కాగా అయ్యన్న పాత్రుడిని విశాఖ విమానాశ్రయంలో అరెస్టు చేసి యలమంచలి వరకూ తీసుకెళ్లి అక్కడ 41ఏ నోటీసులు ఇచ్చి విడుదల చేయడమేమిటన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో అచ్చెన్నాయుడినీ ఇదే విధంగా అర్ధరాత్రి ఆయన ఇంట్లోకి ప్రవేశించి మరీ అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. ఆ తరువాత అచ్చెన్నాయుడి అరెస్టుపై కోర్టు సర్కార్ కు, పోలీసులకు అక్షింతలు వేసిన సంగతి విదితమే. ఇప్పుడు అయ్యన్నపాత్రుడిని అరెస్టు చేసి గన్నవరం తరలించి కోర్టులో హాజరు పరిస్తే కూడా అదే పునరావృతం అవుతుందన్న ఉద్దేశంతో యలమంచిలి వద్ద 41(ఏ) నోటీసులు ఇచ్చి విడుదల చేసి ఉండొచ్చని అంటున్నారు.