Leading News Portal in Telugu

Ayyanna Patrudu Arrest: మాజీమంత్రి అయ్యన్న అరెస్టులో కొత్త ట్విస్ట్..?


Ayyanna Patrudu Arrest: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడుని అరెస్ట్ చేశారు పోలీసులు.. అయితే, అనకాపల్లి జిల్లా వేంపాడు టోల్ ప్లాజా దగ్గర ఆయన్ని తరలిస్తోన్న వాహనాలను అడ్డుకున్నాయి టీడీపీ శ్రేణులు.. దీంతో.. అయ్యన్నను వదిలి వెళ్లిపోయారు పోలీసులు.. హైవే పక్కన హోటల్ కు అయ్యన్నపాత్రుడు తరలివెళ్లారు.. అయ్యన్నపాత్రుడు అరెస్ట్ పై టీడీపీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. అయ్యన్నను అరెస్ట్ చేసిన పోలీసులపై ప్రయివేట్ కేసు వేస్తామని హెచ్చరిస్తున్నారు.. రాష్ట్రంలో గళం విప్పే బీసీ నాయకుణ్ణి ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.. అక్రమ అరెస్టులతో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని.. దొంగల్లా చొరబడి అరెస్టులు చేయడం దారుణం.. 41 నోటీసులు కోసం అరెస్టులు అవసరం ఏంటో అధికారులు చెప్పాలని నిలదీశారు మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, గండి బాబ్జీ.

ఇక, తనను అరెస్ట్‌ చేసి విడిచిపెట్టిన తర్వాత మీడియాతో మాట్లాడారు మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు.. నన్ను అరెస్ట్‌ చేసే తీసుకెళ్తున్న సమయంలో మార్గం పోలీసులకు ఫోన్ కాల్ వచ్చిందన్న ఆయన.. 10 నిముషాల తర్వాత నా దగ్గరకు వచ్చిన పోలీసులు విడిచి పెడుతున్నట్టు చెప్పారని తెలిపారు. 41 (ఎ) నోటీసులు ఇచ్చి 10 రోజుల్లో హనుమాన్ జంక్షన్ వచ్చి హాజరవ్వమన్నారని వెల్లడించారు. అయితే, ఈ నెల 4న పుట్టిన రోజు ఉంది ఆ తర్వాత వస్తానని చెప్పానన్నారు. అయినా.. నేను గన్నవరం సభలో ఎటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు.. జరుగుతున్న విషయాలే చెప్పానన్నారు అయ్యన్నపాత్రుడు.

కాగా, ఈ నెల 14న విచారణకు రావాలని అయ్యన్నకు పోలీసుల నోటీసులు ఇచ్చారు.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, మంత్రులపై అయ్యన్న చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. 41 ఏ కింద నోటీసు ఇచ్చారు. మొదట అరెస్ట్ చేయండి.. ఆ తర్వాత మధ్యలో వదిలేయడం.. 41 A నోటీసులు ఇవ్వడం.. ఇలా అనుమానాస్పదంగా పోలీసుల తీరు ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు.

మరోవైపు.. అయ్యన్న పై కక్ష సాధింపునకే అక్రమ కేసులు అంటూ మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే అరెస్టు చేస్తారా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసులే ప్రతిపక్ష నేతలను కిడ్నాప్ చేసే దారుణ పరిస్థితులు దాపురించాయన్న ఆయన.. ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించే అయ్యన్నపై అక్రమ కేసులు, అరెస్టుతో కక్ష సాధిస్తున్నారు. ప్రభుత్వాన్ని తూర్పారబట్టే బీసీ నేత అయ్యన్న పై మొదటి నుంచి ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. అయ్యన్న పాత్రుడికి 41 ఏ నోటీసు ఇవ్వడానికే పోలీసులు వచ్చి ఉంటే.. కిడ్నాప్ తరహాలో ఎయిర్ పోర్ట్ నుంచి తీసుకెళ్లాల్సిన, నిర్భందించాల్సిన అవసరం ఏముంది..? అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై అయ్యన్న విమర్శలే నేరమైతే.. మంత్రులు, వైసీపీ నేతలు రోజూ చేస్తున్న వ్యాఖ్యలకు, విద్వేష ప్రసంగాలకు జీవితాతం జైల్లో పెట్టాలని వార్నింగ్ ఇచ్చారు. అసమర్థ, మాఫియా పాలకులను విమర్శించక ఏం చేస్తారు..? ధైర్యం ఉంటే తమపై వస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం.. వైసీపీ నేతలు సమాధానం చెప్పాలి. జగన్ చేస్తున్న తప్పులు, నేరాల్లో ఇలా అక్రమ కేసులు బనాయించడం ద్వారా పోలీసులు భాగస్వాములైతే వాళ్లు తీవ్ర మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు చంద్రబాబు.