Health Benefits of Ginger and Dry Ginger: అల్లం ఆహారానికి రుచిని పెంచుతుంది. అది మాత్రమే కాకుండా అల్లంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. మసాలా కూరల్లో మాత్రమే కాకుండా అల్లాన్ని టీ లాంటి పానీయాల్లో కూడా ఉపయోగిస్తారు. అల్లంతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉండటంతో చాలా ఏళ్ల నుంచి దానిని ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తున్నారు. అయితే తాజా అల్లం, పొడి అల్లం ఆరోగ్యానికి వేరే వేరేగా ఉపయోగపడతాయి. వీటి లక్షణాలు వేరుగా ఉంటాయి. పొడి అల్లాన్నే మనం వాడుక భాషలో శొంఠిగా వ్యవహరిస్తుంటాము. తాజా అల్లం బెల్లం కలిపితే జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. అదే పొడి అల్లం గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది. చర్మ వ్యాధులు, రక్తస్రావం రుగ్మతలు, రక్తహీనత, మంట వంటి వాటి చికిత్సలో తాజా అల్లం కంటే శొంఠిని ఉపయోగించడమే మంచిది. ఆయుర్వేదం ప్రకారం పొడి అల్లం ఉత్తమంగా పనిచేస్తోంది.
ఇక మనకు జలుబు చేసినప్పుుడ సాధారణంగా అల్లం టీ తాగుతూ ఉంటాం. అయితే దగ్గు, జ్వరం, వాంతులు మొదలైన వాటికి తాజా అల్లం ఉపయోగపడితే ఆస్తమా, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధుల నివారణకు శొంఠి బాగా పనిచేస్తోంది. తాజా అల్లం వాతాన్ని పెంచుతుంది, ఎండిన అల్లం వాతాన్ని సమతుల్యం చేస్తుంది. శొంఠి కఫాన్ని తగ్గిస్తుంది. ఈ పొడిని నీళ్లలో కలిపి తాగడం వల్ల సీజనల్ గా వచ్చే ఫ్లూ, జలుబు, దగ్గు చాలా త్వరగా తగ్గిపోతాయి. శొంఠిని డైట్‌లో చేర్చుకుంటే ఇన్ఫెక్షన్లు, ఫ్లూ వంటివి వచ్చే అవకాశం ఉండదు. ఇక బరువు తగ్గాలనుకునే వారికి కూడా శొంఠి మంచి ఔషధం అని చెప్పవచ్చు. నీటిలో శొంఠిని వేసి మరిగించి తరువాత వాటిని వడకట్టి ఆ నీటిలో కొద్దిగా తేనె కలుపుకొని తాగడం వలన బరువు కూడా తగ్గుతారు. తాజా అల్లంతో అంతగా బరువు తగ్గలేరు. ఏది ఏమైనా తాజా అల్లం కంటే శొంఠితోనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.