28 ఏళ్ల కిందట ఈ రోజు.. | begining of history 28 years ago| chandrababu| 1st time| swornin| cm| new| era| telugu| pride| hyderabad| it
posted on Sep 1, 2023 4:26PM
1995, సెప్టెంబర్ 1.. చరిత్రలో నిలిచిపోయే రోజు. మారిన తెలుగుజాతి తలరాతకు తొలి అడుగు పడిన రోజు. తెలుగోడి కీర్తిపతాకం ప్రపంచ యవనికపై రెపరెపలాడేందుకు అంకురం పడిన రోజు. మన పిల్లలను సాఫ్ట్వేర్ నిపుణులుగా తీర్చిదిద్ది వారి ఉజ్వల భవిష్యత్ కోసం అమెరికాకు వంతెన వేసిన రోజు. సరికొత్త హైదరాబాద్ నిర్మాణానికి బీజం పడిన రోజు. సైబరాబాద్ మహానగర నిర్మాణానికి పునాదది పడిన రోజు. ప్రభుత్వ పనితీరు మారిన రోజు. పేదల చెంతకే పాలన నడిచి వచ్చిన రోజు. అసలైన ప్రజారంజక పాలనకు తొలి అడుగు పడి నేటికి 28 ఏళ్లు.
ఔను.. 28 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజున అంటే 1995 సెప్టెంబర్ 1న నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన శుభదినం. ఆ రోజు జరిగిన ఆ కీలకఘట్టం తెలుగుజాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆ సమయానికి ఎవరూ ఊహించి ఉండరు. కానీ కాలచక్రం అందుకు సాక్షిగా నిలిచి.. చంద్రబాబు హయాంను చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. ఇప్పటికీ రెండు తెలుగురాష్ట్రాల్లో చంద్రబాబు అంటే పీక కోసుకునేంత అభిమానులు కోకొల్లలు ఉన్నారంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. ప్రస్తుత ఏపీ, తెలంగాణలోని ఏ మారుమూల తాండాలకో, గిరిజన గూడేలకో వెళ్లినా.. అక్కడ మీకు కనీసం ఒక్కడైనా చంద్రబాబు అభిమాని తప్పక కనిపిస్తాడు. చంద్రబాబు వల్లే మా బిడ్డ అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడని చెప్పే తండ్రులు ఎందరో ఉన్నారు.
చంద్రబాబు హయాంలోనే మా అబ్బాయికి టీచర్ జాబ్ వచ్చిందని సంతోషించే తల్లులు తెలుగురాష్ట్రాల్లో లక్షల్లో ఉంటారు. చంద్రబాబు జమానాలోనే తాము తొలిసారి గ్యాస్ సిలిండెర్‌తో వంట చేసుకున్నామని చెప్పే పేదలు.. చంద్రబాబు వల్లే తాము డ్వాక్రా గ్రూపులతో డబ్బులు పోగేసుకొని తమ కుటుంబాలను బాగుపరుచుకున్నామంటూ ఆనందభాష్పాలు కార్చే మహిళలు తెలుగునేలపై ఏ మూలకు వెళ్లినా తారసపడతారు. ఈ రోడ్డు జన్మభూమిలో భాగంగా వేసిందని.. ఆ స్కూల్ చంద్రబాబు హయాంలో కట్టించిందని.. ఇప్పటికీ చెప్పుకుంటారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు ఆనవాళ్లను ఎవరూ తుడిపేయలేరు.
ఎన్టీఆర్‌ను గద్దె దించారనే అపవాదుతోనే అందలమెక్కిన చంద్రబాబు నాడు తాను చేసింది ఎన్టీఆర్‌కు వెన్నుపోటు కాదని.. ఆంధ్రప్రదేశ్‌ను, టీడీపీని ఓ దుష్టశక్తి కబంధ హస్తాల నుంచి విడుదల చేసిన రోజని చెబుతారు తెలుగు తమ్ముళ్లు. ఎన్టీఆర్‌లా చంద్రబాబుకు ఛర్మిష్మా లేదు. ఆయనలా అనర్గళ వాగ్దాటీ లేదు. అయినా తన పాలనా దక్షతతో ఎన్టీఆర్‌ను మరిపించారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అంతకుమించి.. పని చేసి చూపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రభుత్వ శాఖలకు పట్టిన దశాబ్దాల బూజును, ఒక్కసారిగా దులిపేశారు. అసలైన వర్క్ కల్చర్‌ను తీసుకొచ్చారు. పని అంటే ఎలా చేయాలో.. పనితీరు ఎలా ఉంటుందో , ఎలా ఉండాలో రుచి చూపించారు. మేం ప్రభుత్వ ఉద్యోగులం.. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరంటూ విర్రవీగే వారి కొవ్వు కరిగించేశారు. ఫైళ్ల వారోత్సవాలతో.. గవర్నమెంట్ ఆఫీసుల్లో గుట్టలుగా పేరుకుపోయిన ఫైళ్లను పరుగులు పెట్టించారు.
ఆకస్మిక తనిఖీలతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. సీఎం చంద్రబాబు ఎప్పుడు, ఏ ఆఫీసుకు చెకింగ్‌కు వస్తారో తెలీక.. నిత్యం అలర్ట్‌గా ఉండేవారు అధికారులు. అంతకుముందు ఆఫీసులోనే నిద్రపోయే కల్చర్ ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు.. ఆ తర్వాత మిలటరీ ఆఫీసుల్లా ఎనీటైమ్ అలర్ట్‌గా ఉండేలా చేసిన ఘనత చంద్రబాబుదే. బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్‌లాంటి గవర్నమెంట్ ఎంప్లాయిస్ను.. కష్టపడి పని చేసేలా తీర్చిదిద్దారు. ప్రజలకు ప్రభుత్వాన్ని మధ్య అంతరాన్ని తగ్గించేశారు. ప్రభుత్వంలో ఉన్న 47 కీలక శాఖలను నిరంతరం పర్యవేక్షిస్తూ.. వాటి పనితీరులో గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉద్యోగుల మైండ్ సెట్ మార్చిన.. మాస్టర్ మైండ్ నారా చంద్రబాబునాయుడు.
చాలా తక్కువ సమయంలోనే ‘పని చేసే ముఖ్యమంత్రి’ గా పేరుగాంచారు. తుఫాన్లు, వరద ముంపు ప్రాంతాలకు 24 గంటల్లోనే చేరుకొని.. దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించి.. సంక్షోభ సమయాల్లో సమర్థత చాటుకొన్నారు. సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టిన ‘శ్రమదానం’ కార్యక్రమం.. ఆ తర్వాత ‘జన్మభూమి’గా మారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రూపురేకలనే మార్చేసింది. అందరికీ శ్రమ విలువ తెలిసేలా చేసింది. అభివృద్ధిలో అందరినీ భాగస్వామ్యం చేసింది. ఏళ్ల తరబడి పరిష్కారం కాని ఎన్నో పనులు.. ప్రజలు కలిసికట్టుగా శ్రమదానంతో సాధించుకొని.. చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పుకునేవారు. ఎన్నారైలనూ జన్మభూమిలో భాగస్వామ్యం చేసి.. మాతృభూమి బాగుకోసం మేముసైతమంటూ తరలివచ్చేలా చేశారు. పచ్చదనం-పరిశుభ్రత.. చంద్రబాబు బ్రెయిన్ ఛైల్డే.
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాలు, అప్పటికి నామమాత్రంగా ఉన్న ‘డ్వాక్రా’ పథకాన్ని ఉద్యమంలా నడిపించిన తీరు అప్పట్లో ఓ సంచలనం. ‘డ్వాక్రా పథకం’తో గ్రామీణ ప్రాంత మహిళలలో చైతన్యం వెల్లివిరిసింది. సామాజిక నాయకత్వం వెలుగు చూసింది. డ్వాక్రా సంఘాల విజయగాథలను తెలుసుకోవడానికి ఆనాడు దేశ, విదేశీ ప్రముఖులు ఏపీని సందర్శించేవారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎగసిన మహిళా ఆర్థిక స్వావలంబన చైతన్యంపై బ్రిటన్ పార్లమెంట్లో ప్రత్యేకంగా ప్రస్తావించారంటే చంద్రబాబు డ్వాక్రా గ్రూపులతో ఎంతటి ఘన చరిత్ర సృష్టించారో తెలుస్తోంది.
తెలుగువారికి ఐటీని పరిచయం చేసి.. మన జాతి తలరాత మార్చేసిన ఘనుడు చంద్రబాబు. హైదరాబాద్‌ను పెట్టుబడుల కేంద్రంగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్‌గా చేసిందీ చంద్రబాబే. కంప్యూటర్ను వాడిన తొలి ముఖ్యమంత్రీ చంద్రబాబే. ఆనాటి హైటెక్‌సిటీతోనే ఈనాడు ఇంటింటికో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉన్నారు. వేలాది ఇంజినీరింగ్ కాలేజీలతో లక్షలాది ఐటీ నిపుణులను తయారు చేశారు. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్నే హైదరాబాద్ రప్పించారు. అందుకే చంద్రబాబును అప్పట్లో దేశ ప్రముఖులంతా ‘సీఎం’ అని కాకుండా ‘సీఈవో’ అని పిలిచేవారు.
సంస్కరణలతో ఏపీని పరుగులు పెట్టించారు సీఎం చంద్రబాబు. పోఖ్రాన్ అణుపరీక్షలతో భారత్‌కు రుణాలివ్వరాదని ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వంటి ఆర్థిక సంస్థలపై అమెరికా ఆంక్షలు పెట్టినా, ఆనాడు చంద్రబాబు ప్రపంచ బ్యాంకు రుణం తేగలిగారు. అయితే, విద్యుత్ రంగంలో సంస్కరణలు సత్ఫలితాలచ్చాయి. దళిత వర్గానికి చెందిన బాలయోగి లోక్‌సభ స్పీకర్‌గా, శ్రీమతి ప్రతిభాభారతిని అసెంబ్లీ స్పీకర్‌గా చేసి.. దళితులకు సముచిత గౌరవాన్ని కల్పించింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే.
ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్సార్, కేసీఆర్, జగన్మోహన్రెడ్డి.. ఇలా తెలుగు నేలను ఎంతమంది ముఖ్యమంత్రులు పాలించినా.. వారందిలోకీ చంద్రబాబు పాలనే తెలుగుజాతి తలరాతని బాగా మార్చేసి తలమానికంగా నిలిచిందని ఆయన ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తారు. రాజకీయ విభేదాల కారణంగా ఆయన గొప్పతనాన్ని తక్కువ చేసి చూపాలని ప్రయత్నించి భంగపడిన వారెందరో ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండుసార్లు సీఎంగా, నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా.. చంద్రబాబు పేరు తెలుగునేలపై ఆ చంద్రార్కం నిలిచి ఉంటుంది. ఎవరెన్ని కుట్రలు చేసినా.. అమరావతిని కనుమరుగు చేసేలాంటి కుతంత్రాలు నడిపినా.. చంద్రబాబు ఆనవాళ్లను తుడిచేయడం అసాధ్యం అనడంలో సందేహం లేదు. ఎవరు హైదరాబాద్ వెళ్లినా.. హైటెక్ సిటీని చూసినా.. ఏ ఫ్లైఓవర్లపై ప్రయాణించినా.. రైతు బజారుకెళ్లినా.. ఎవరు కొవాగ్జిన్ టీకా తీసుకున్నా.. ఏ ఇంజినీరింగ్ కాలేజీలో చదివినా.. ఏ ‘మీ సేవ’ కార్యాలయానికి వెళ్లినా.. ఎక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా.. అవన్నీ చంద్రబాబు పాలన అనే మహావృక్షానికి కాసిన సుమధుర ఫలాలే. అందుకే, తెలుగుజాతి ఉన్నంత కాలం చంద్రబాబు పేరు, ముఖ్యమంత్రిగా ఆయన పాలన చిరస్మరణీయం. అందుకే, 1995, సెప్టెంబర్ 1.. ఓ చారిత్రకదినం. గ్రహణం చాయలు వీడగానే మళ్లీ చంద్రోదయం ఖాయం.