Leading News Portal in Telugu

Asia Cup-2023: టీమిండియా జెర్సీపై కనిపించని పాక్ లోగో


ఆసియా కప్‌-2023 టోర్నమెంట్ నేపథ్యంలో ఆటగాళ్ల జెర్సీలపై ఆతిథ్య జట్టు పేరు లేకపోవడం ఇప్పుడు విమర్శలకు దారి తీసింది. సాధారణంగా మేజర్‌ క్రికెట్‌ ఈవెంట్లలో ప్లేయర్లు వేసుకునే జెర్సీలపై హోస్ట్‌ పేరు కూడా కనిపిస్తుంది. అయితే, ఈసారి ఆసియా కప్‌ విషయంలో మాత్రం ఇలా జరుగలేదు. దీంతో పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్లు ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆసియా వన్డే కప్‌-2023 ఈవెంట్‌ ఆతిథ్య హక్కులు మొదట పాకిస్తాన్‌ దక్కించుకున్నప్పటికి.. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపించేందుకు బీసీసీఐ ససేమిరా అనడంతో శ్రీలంక బరిలోకి వచ్చింది.

టీమిండియా ఆడే మ్యాచ్ లన్నీ శ్రీలంకలో జరిగే విధంగా హైబ్రిడ్‌ పద్ధతిలో టోర్నమెంట్ నిర్వహణకు ఆసియా క్రికెట్ కౌన్సిల్.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డును ఒప్పించింది. ఈ నేపథ్యంలో ఆగష్టు 30 నుంచి ఈ వన్డే ఈవెంట్‌ ప్రారంభమైంది. అయితే, ఆటగాళ్ల జెర్సీలపై పాక్ లోగో మిస్‌ కావడం క్రికెట్‌ వర్గాల్లో తీవ్రమైన చర్చకు దారి తీసింది. కావాలనే పాకిస్తాన్‌ పేరును మిస్‌ చేశారంటూ మాజీ క్రికెటర్లు రషీద్‌ లతీఫ్‌, మొహ్సిన్‌ ఖాన్‌ ఏసీసీపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు.. ఆటగాళ్ల జెర్సీలపై తమ లోగో లేకపోవడానికి గల కారణాలను వెల్లడించింది.

అయితే, ఈ సంవత్సరం నుంచి ఆసియా క్రికెట్‌ మండలి కొత్త మార్గదార్శలకాలను అమలులోకి తీసుకువచ్చిందని.. దాని ప్రకారం ఆతిథ్య జట్ల లోగోలు ఆటగాళ్ల జెర్సీలపై ఉండడం లేదని చెప్పినట్లు తెలిపారు. ఇక నుంచి ఏ జట్టుకైనా ఇదే రూల్‌ వర్తిస్తుందని చెప్పినట్లు టాక్. కాగా, ఆసియా వన్డే కప్‌ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌.. నేపాల్‌పై గెలవగా.. రెండో మ్యాచ్‌లో శ్రీలంక బంగ్లాదేశ్‌ను ఓడించింది. అయితే, మూడో మ్యాచ్ రేపు భారత్-పాకిస్థాన్ మధ్య జరుగనుంది.