Leading News Portal in Telugu

Aditya L1 mission: PSLVC-57 రాకెట్ ప్రయోగాని కౌంట్ డౌన్ షురూ.. రేపే నింగిలోకి..


Aditya L1 mission: మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో).. చంద్రయాన్‌-3తో చందమామపై ఉన్న రహస్యాలను ఛేదించే పనిలోపడిపోయిన ఇస్రో.. మరోవైపు సూర్యుడిపై సైతం ఫోకస్‌ పెట్టింది.. దీనికోసం PSLVC-57 రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది.. ఇక, PSLVC-57 రాకెట్ ప్రయోగానికి ఈ రోజు కౌంట్‌డౌన్‌ ప్రారంభించింది. 24 గంటల కౌంట్‌డౌన్‌ ప్రక్రియ అనంతరం రేపు ఉదయం 11 గంటల 50 నిమిషాలకు రాకెట్‌ను ప్రయోగించనున్నారు శాస్త్రవేత్తలు.. మరోవైపు.. రాకెట్‌లో ఇంధనం నింపే ప్రక్రియ కొనసాగుతోంది.

కాగా, PSLVC-57 ప్రయోగానికి లాంచ్ అథరైజేషన్ బోర్డు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది.. శ్రీహరికోటకు చేరుకున్న ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్.. ప్రయోగ ప్రక్రియపై శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించారు.. రాకెట్ లోని వివిధ విభాగాలను పరిశీలించారు. ఈ ప్రయోగం ద్వారా సూర్యుడి పై పరిశోధనలకు ఆదిత్య- L1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతున్నారు.. ఇక, నిన్న షార్‌లోని బ్రహ్మప్రకాష్‌హాలులో మిషన్‌ సంసిద్ధత సమావేశం నిర్వహించారు. పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్‌కు అన్ని పరీక్షలు నిర్వహించి లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డుకు అప్పగించారు. ల్యాబ్‌ చైర్మన్‌ రాజరాజన్‌ రాకెట్‌కు మరోసారి పరీక్షలు నిర్వహించి.. కౌంట్‌డౌన్, ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటన చేయడం.. ఇప్పుడు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించారు. సూర్యుడిలో వచ్చే మార్పులు.. అక్కడ జరుగుతోన్న పరిణామాలపై అధ్యయనం.. ఆ సమారాన్ని ఇస్రోకు చేరవేయడం ఆదిత్య- L1 పనిగా ఉంటుంది.