Leading News Portal in Telugu

YSR Rythu Bharosa: గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం జగన్‌.. నేడే వారి ఖాతాల్లో సొమ్ము జమ


YSR Rythu Bharosa: సంక్షేమ పథకాలకు సంబంధించిన సొమ్ములను వరుసగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తుంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఇక, రైతులకు కూడా ఎప్పటికప్పుడూ.. సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. ఈ తరుణంలో కౌలు రైతులకు శుభవార్త వినిపించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఈ రోజు రైతు భరోసా నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.. రైతుల ఖాతాల్లో వర్చువల్ గా నగదు జమ చేయబోతున్నారు.. కౌలు రైతులతో పాటు దేవాదాయ భూమి సాగుదారులకు కూడా ఆర్థిక సాయం అందబోతోంది.. ఈ స్కీమ్‌ కింద మొత్తం 1,46,324 మందికి లబ్ది చేకూరనుండగా.. ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు.. అంటే.. మొత్తం లబ్ధిదారుల ఖాతాల్లో 109.74 కోట్ల రూపాయలు జమ చేస్తారు సీఎం వైఎస్‌ జగన్‌..

కాగా, భూ యజమానులకు వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున పెట్టు­బడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే కాగా.. మే నెలలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో రూ.2 వేలు చొప్పున మూడు విడతల్లో ఈ సాయాన్ని జమ చేస్తూ వస్తోంది.. ఇదే సమయంలో.. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతుల కుటుంబాలతో పాటు దేవదాయ, అటవీ భూమి సాగుదారులకు కూడా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందజేస్తోంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సర్కార్.