Leading News Portal in Telugu

Singapore Presidential Election: సింగపూర్‌ అధ్యక్షుడిగా భారత సంతతి షణ్ముగరత్నం ఎన్నిక


Singapore Presidential Election: సింగపూర్‌ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వ్యక్తి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. భారతీయ సంతతికి చెందిన ఆర్థికవేత్త థర్మన్‌ షణ్ముగరత్నం సింగపూర్‌ అధ్యక్ష ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. శుక్రవారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో 70 శాతానికి పైగా ఓట్లు ఆయన దక్కించుకున్నారు. పోలైన 20,48,000 ఓట్లలో మాజీ మంత్రి షణ్ముగరత్నంకు మద్దతుగా 70.4 శాతం ఓట్లు (17,46,427) పోలవగా… ఆయన ప్రత్యర్థులైన చైనా సంతతి అభ్యర్థులు ఎన్జీ కాక్‌ సాంగ్‌ 15.77 శాతం టాన్‌ కిన్‌ లియాన్‌కు 13.88 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల విభాగం ప్రకటించింది. రిటర్నింగ్‌ అధికారి ప్రకటించిన ఈ ఫలితాలతో సింగపూర్‌కు అధ్యక్షుడిగా షణ్ముగరత్నం ఎన్నిక ఖరారైంది. భారతీయ సంతతికి చెందిన మూడో వ్యక్తి సింగపూర్‌ దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి లీ సీన్‌ లూంగ్‌ కొత్త దేశాధ్యక్షుడిని అభినందించారు. ప్రధాని లీ సారథ్యంలోని పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీ (పీఏపీ) ఈ ఎన్నికల్లో షణ్ముగరత్నంకు అండగా నిలిచింది. గతంలో భారతీయ సంతతికి చెందిన ఎస్‌.రామనాథన్‌, దేవన్‌ నాయర్‌ సింగపూర్‌ అధ్యక్షులుగా పనిచేశారు. వారి తరువాత మూడో వ్యక్తి షణ్ముగరత్నం.

సింగపూర్‌ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు శుక్రవారం ప్రకటించారు. షణ్ముగరత్నం సింగపూర్‌ దేశాధ్యక్షుడిగా ఎన్నికయినట్టు ఎన్నికల సింగపూర్‌కు 9వ అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు ప్రకటించారు. థర్మన్‌ షణ్ముగరత్నం 2011 నుంచి 2019 దాకా సింగపూర్‌ ఉప ప్రధానిగా సేవలందించారు. 2019 – 2023 మధ్యకాలంలో సీనియర్‌ మంత్రిగా కేబినెట్‌లో విధులు నిర్వహించారు. ప్రముఖ ఆర్థికవేత్తగా అంతర్జాతీయంగా పేరున్న షణ్ముగరత్నం సింగపూర్‌లో స్థిరపడ్డ తమిళ కుటుంబంలో 1957లో జన్మించారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ నుంచి పట్టా పొందారు. తర్వాత కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో మాస్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ.. హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి మాస్టర్‌ ఇన్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ చేశారు. విద్యార్థిదశలో క్రీడల్లో చురుగ్గా ఉండేవారు. ‘‘ఫాదర్‌ ఆఫ్‌ పాథాలజీ ఇన్‌ సింగపూర్‌’’గా పేరున్న వైద్య శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ కె.షణ్ముగరత్నం కుమారుడే థర్మన్‌ షణ్ముగరత్నం. స్థానిక న్యాయవాది జేన్‌ యుమికో ఇట్టోగిని ఆయన వివాహం చేసుకున్నారు. దేశంలో 2011 తర్వాత అధ్యక్ష ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. ప్రస్తుత అధ్యక్షుడు హలిమా యాకోబ్‌ పదవీ కాలం సెప్టెంబర్‌ 13న ముగియనున్నది. అనంతరం షణ్ముగరత్నం బాధ్యతలు స్వీకరించనున్నారు. 6 సంవత్సరాలపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.