Leading News Portal in Telugu

One Nation One Election: వన్ నేషన్ – వన్ ఎలక్షన్.. వైసీపీ విధానంపై క్లారిటీ


One Nation One Election: దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలకు నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది కేంద్ర ప్రభుత్వం.. ‘వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌’ పేరుతో ఇప్పటికే అభిప్రాయ సేకరణలో పడిపోయింది.. ఒకేసారి ఎన్నికలకు నిర్వహించేవైపునకు వడివడిగా అడుగులు వేస్తోంది.. భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసింది.. ఎన్నికల నిర్వహణ, సవాళ్లు లాంటి అంశాలపై ఈ కమిటీ సూచనలు చేయనుంది.. ఇక, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఈ విధానానికి మద్దతు పలుకుతున్నాయి.. తాజాగా.. వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానానికి వైసీపీ అనుకూలమని స్పష్టం చేశారు ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు.

వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌ విధానానికి మేం అనుకూలమని వైసీపీ మంత్రులు క్లారిటీ ఇచ్చారు.. ఎన్టీవీతో మాట్లాడిన మంత్రి మేరుగ నాగార్జున.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని గెలిపించుకోవటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎన్నికలు రేపు వస్తాయా..? లేక టైమ్ లో వస్తాయా..? అనే అంశం పై మా పార్టీ ఆలోచించటం లేదన్న ఆయన.. చంద్రబాబు మునిగిపోతున్న నావగా అభివర్ణించారు. అద్దె కంపెనీలను తెచ్చుకుని వాటేసుకుంటున్నాడు.. కానీ, ప్రజలంతా జగన్ వెంట ఉన్నారని తెలిపారు. పార్టీలను అప్పు తెచ్చుకుంటున్నాడు.. మమ్మల్ని బూతులు తిట్టిస్తున్నాడు.. రాజకీయాలకు చంద్రబాబు అవసరం లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు అమరావతి ప్రాంతంలో డొల్ల కంపెనీల ద్వారా కోట్ల రూపాయలు కొట్టేశాడని ఆరోపించారు.. అవినీతి చేయటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ విమర్శలు గుప్పించారు మంత్రి మేరుగ నాగార్జున.