హరికృష్ణ జయంతి.. స్మరించుకొన్న నందమూరి, నారా కుటుంబాలు | nara nandamuri families remember harikrishna| jayanthi| leader| junior| ntr| nara| lokesh
posted on Sep 2, 2023 1:36PM
తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీర్ కుమారుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ 67వ జయంతి శనివారం(ఆగస్ట్ 2). ఈ సందర్భంగా నందమూరి హరికృష్ణకు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ఘనంగా నివాళులర్పించారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎంతో మందికి హరికృష్ణ ఆత్మీయుడిగా నిలిచారని గుర్తు చేశారు. నిండైన తెలుగుదనానికి ప్రతిరూపంగా తెలుగువారి అభిమానాన్ని పాందారన్నారు. హరికృష్ణతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చంద్రబాబు ఈ మేరకు ట్విట్ చేశారు.
అలాగే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సైతం తన మావయ్య హరికృష్ణ జయంతి సందర్భంగా తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా స్పందించారు. హరి మామయ్య జయంతి సందర్భంగా ఆయన జ్జాపకాలు ఒక్కసారిగా కళ్ల ముందు కదిలాయన్నారు. వెండితెరపై తన నటనతో అభిమానులకు ఆరాధ్య నటుడైన హరి మావయ్య డేరింగ్ పొలిటీషియన్ అని కొనియాడారు. అలంకరించిన పదవులకే వన్నె తెచ్చిన ఆయన తనకు నిత్య స్పూర్తి అని లోకేశ్ తెలిపారు.
ఇక నందమూరి హరికృష్ణ తనయులు నందమూరి కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా తన తండ్రిని తలుచుకొని యంగ్ టైగర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్ రామ్ ఎమోషన్ అయ్యారు. ఆ క్రమంలో ట్విట్టర్ వేదికగా తన తండ్రి నందమూరి హరికృష్ణను స్మరించుకొంటూ వారు ఈ అస్తిత్వం మీరు.. ఈ వ్యక్తిత్వం మీరు.. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే అంటూ స్పందించారు.
1956, సెప్టెంబర్ 2న ఉమ్మడి కృష్ణాజిల్లాలోని నిమ్మకూరులో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు, బసవతారకం దంపతులకు హరికృష్ణ జన్మించారు. 1996 – 1999 మధ్య చంద్రబాబు నాయుడు కేబినెట్ లో నందమూరి హరికృష్ణ.. రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత అంటే 2008 నుంచి 2013 వరకు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. నందమూరి హరికృష్ణ చిన్నతనం నుంచే సినిమాల్లో నటించారు. బాలనటుడిగా శ్రీకృష్ణావతారం, తల్లాపెళ్లామా, తాతమ్మ కల, రామ్ రహీం, దాన వీర శూర కర్ణలో నటించారు. ఆ తర్వాత శ్రీరాములయ్య, సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో… సీతయ్య, టైగర్ హరిచంద్రప్రసాద్ తదితర చిత్రాల్లో కీలక భూమిక పోషించారు.
అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిట్టనిలువుగా చీల్చేందుకు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన హరికృష్ణ.. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. నందమూరి హరికృష్ణకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. 2018, ఆగస్ట్ 29న నల్గొండ జిల్లాలోని నార్కెట్పల్లి వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఆయన మరణించారు.