Karumuri Nageshwara Rao: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సీరియస్ కామెంట్స్ చేశారు. టీడీపీ హయాంలో ఏ ఒక్కరికి అయినా ఇసుక ఉచితంగా ఇచ్చారా అంటూ మంత్రి ప్రశ్నించారు. గాదె కింద పందికొక్కులు లాగా మేసేశారంటూ ఆయన మండిపడ్డారు. అక్రమ ఇసుక రవాణాను ఎమ్మార్వో వనజాక్షి అడ్డుకుంటే చింతమనేని ప్రభాకర్ ఆమె జుట్టు పట్టుకుని లాగి దాడి చేశారని ఆయన పేర్కొన్నారు. ఇవాళ ఇసుక విషయంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా విధానం రూపొందించామని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని చూసి ప్రతిపక్షాలు తట్టుకోలేక పోతున్నాయని ఆయన మండిపడ్డారు.
చంద్రబాబుకు ఐటీ నోటీసులపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. చంద్రబాబు నీతి కబుర్లు చెబుతుంటాడని.. ఆయనకు ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చాయని.. అయినా ఇంత వరకూ చంద్రబాబు ఎందుకు నోరు విప్పటం లేదని మంత్రి ప్రశ్నించారు. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి పనికి మాలిన పనులు అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు జీవితం అంతా స్టే తెచ్చుకోవటమేనని.. సింగిల్‌గా పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు ఊసరవెల్లి స్వభావం బీజేపీ నేతలకు తెలుసని ఆయన విమర్శించారు. నోటీసుల విషయంలో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణం అయిన ఉసురు చంద్రబాబును వెంటాడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
అచ్చెన్నాయుడుకు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు పక్కన ఉన్నాడని అచ్చెన్నాయుడు టీడీపీ గెలుస్తుందని అంటున్నాడని.. పార్టీ లేదు బొక్కా లేదు అన్నది అచ్చెన్నాయుడు మనసులోని మాట అంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు.