ఆసియా కప్-2023లో భాగంగా నేడు ( శనివారం ) పల్లెకెలె వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న హైఓల్టేజీ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న టీమిండియా.. పాక్ బౌలర్ల ధాటికి చతికిలపడింది. షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్ నిప్పులు చెరిగే బంతులతో రెచ్చిపోవడంతో భారత జట్టు టాపార్డర్ 66 పరుగులకే కుప్పకూలింది. తొలుత షాహీన్ అఫ్రిది భారత టాపార్డర్ బ్యాటర్ల భరతం పట్టాడు.. ఆ తర్వాత హరీస్ రౌఫ్ టీమిండియా బ్యాటర్లకు పదునైన బంతులు విసిరి చుక్కలు చూపించాడు.
అఫ్రిది.. ఐదో ఓవర్ ఆఖరి బంతికి రోహిత్ శర్మను (11), ఏడో ఓవర్ మూడో బంతికి విరాట్ కోహ్లి (4) క్లీన్ బౌల్డ్ చేశాడు.. ఇక, హరీస్ రౌఫ్.. 10వ ఓవర్ ఆఖరి బంతికి శ్రేయస్ అయ్యర్‌ను (14), 15వ ఓవర్ తొలి బంతికి శుభ్‌మన్ గిల్‌ను (10) పెవిలియన్ కు పంపించాడు. దీంతో టీమిండియా 14.1 ఓవర్లలో కేవలం 66 రన్స్ మాత్రమే చేసి టాప్-4 వికెట్స్ ను కోల్పోయింది. టీమిండియా టాప్-3 బ్యాటర్లు అఫ్రిది, రౌఫ్‌ల చేతుల్లో క్లీన్ బౌల్డ్ కావడం గమనార్హం.
ఇక, శ్రేయస్ అయ్యర్ (14).. హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో ఫకర్ జమాన్‌కు క్యాచ్ ఇచ్చి డగౌట్ కు చేరాడు. 31 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 156/4గా ఉంది. ఇషాన్ కిషన్ (58), హార్దిక్ పాండ్యా (43) క్రీజ్‌లో నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. అఫ్రిది 5 ఓవర్లలో 2 మెయిడిన్లు వేసి 15 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకోగా.. హరీస్ రౌఫ్ 5 ఓవర్లలో 36 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా టాపార్డర్ బ్యాటర్లకు తొందరగా పెవిలియన్ కు పంపించడంలో పాక్ బౌలర్లు సక్సెస్ అయ్యారు.