Leading News Portal in Telugu

Korutla Deepti Murder: దీప్తి మర్డర్ కేసులో వీడిన మిస్టరీ.. ఐదుగురు అరెస్ట్


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దీప్తి హత్య కేసు మిస్టరీ వీడింది. చెల్లి చందనే అక్క దీప్తిని హత్య చేసినట్లు పోలీసుల విచారణ తేలింది. ఈ కేసును పోలీసులు తొందరగా చేధించారు. ఈ సందర్భంగా జగిత్యాల ఎస్పీ ఎగ్గడి భాస్కర్ మాట్లాడుతూ.. ఆర్మూర్ బాల్కొండ రూట్లో వెళ్తుండగా నిందితులను పట్టుకున్నామని పేర్కొన్నారు. 2019లో బంక చందన హైదరాబాద్ లో బీటెక్ లో జాయిన్ అయింది.. రెండు సంవత్సరాలు చదివాక చందన డీటైన్డ్ అయింది.. ఉమర్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది అని ఎస్పీ తెలిపారు.

గత నెల 19 న ఉమర్ కోరుట్ల వచ్చాడు.. పెళ్లి విషయం మాట్లాడుకున్నారు అని జగిత్యాల ఎస్పీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు. ఆగస్టు 28న ఉమర్ ని రమ్మని చందన కాల్ చేసి చెప్పింది.. ప్లాన్ లో భాగంగా అక్కా చెల్లెలు ఇద్దరు మద్యం తాగారు.. అనంతరం ఉమర్ ఇంట్లోకి వచ్చాడు.. డబ్బులు నగలు సర్దుకుంటున్న సమయంలో దీప్తికి మెలుకువ వచ్చింది.. దీంతో ఉమర్ ను దీప్తి ప్రతిఘటించడంతో చున్నీతో నోరు కట్టేశారు.. నోటికి ప్లాస్టర్ వేశారు.. ప్లాస్టర్ వేయడంతో ఊపిరాడక దీప్తి మరణించింది అని ఎస్పీ తెలిపాడు.

ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశామని ఎస్పీ ఎగ్గడి భాస్కర్ పేర్కొన్నారు. కాగా దీప్తి పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. ఇక, దీప్తి మృతి చెందిన తర్వాత చందన అదృశ్యం అయ్యింది. తాజాగా ఈ ఈ కేసులో దీప్తి చెల్లెలు చందనతో పాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చందన బాయ్ ఫ్రెండ్ ఉమర్, అతని తల్లి, చెల్లితో పాటు మరొకరిని విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి.