ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టే ఆలోచనలో జగన్ సర్కార్? | jagan sarkar to mortgage people assets| registrations| new| policy| impliments| papers
posted on Sep 3, 2023 6:51AM
జగన్ సర్కార్ తీరు కాదేదీ తాకట్టుకు అనర్హం అన్నట్లుఅన్నట్లుగా ఉంది. ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టేసింది. రాష్ట్ర ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అందిన కాడికి అప్పులు చేసేసింది. వివిధ కార్పొరేషన్ల పేరిట, బాండ్లను ష్యురీటీగా పెట్టి రకరకాల మార్గాల ద్వారా ప్రపంచ బ్యాంకుల వద్ద కూడా అప్పలు చేసింది. మద్యంపై వచ్చే ఆదాయాన్ని కూడా తనఖా పెట్టి అప్పు తెచ్చింది. చివరికి దేవాలయాల భూములను కూడా తాకట్టు పెట్టేందుకు ప్రయత్నించగా దానికి కోర్టులు బ్రేకులేశాయి.
ఒక రాష్ట్రం తన పరిధికి ఎంత అప్పు చేయడానికి నిబంధనలు అంగీకరిస్తాయో అంతా జగన్ సర్కార్ ఎప్పుడో చేసేసింది.అంతకు మించి కూడా చేసేసింది. అయినా ఇంకా అప్పులు కావాలని కేంద్రాన్ని కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమాలాడుకుంటున్నది. అందుకు కేంద్రం పెట్టే షరతులకు ఒప్పుకొని ప్రజా ప్రయోజనానికి కూడా గండికొట్టేసింది.ఇప్పటి వరకూ చేసిన అప్పులు సరిపోలేదేమో కానీ ఇప్పుడు ఏకంగా ప్రజల ప్రైవేట్ ఆస్తులను కూడా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ తాకట్టు పెట్టే ఆలోచన చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో ఇప్పుడు మరో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వం. కార్డ్ ప్రైమ్ అని కొత్త సాఫ్ట్ వేర్ తో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. ఈ నూతన విధానంలో లాభనష్టాలపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. వీటన్నిటినీ గమనిస్తే ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆస్తులపై కూడా హక్కు తనదే అని భావిస్తోందా? అవసరమైతే ప్రజల ప్రైవేట్ ఆస్తులను కూడా కావాల్సిన విధంగా తాకట్టు పెట్టుకొని అప్పు తెచ్చుకోవాలని చూస్తున్నదా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ఎందుకంటే ఈ నూతన రిజిస్ట్రేషన్ విధానంలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రజలకు ఇవ్వరట. కేవలం కలర్ జిరాక్స్ మాత్రమే హక్కు దారులకు అందిస్తారట. ఎప్పుడైనా ఆస్తి హక్కుదారులు తమ ఒరిజినల్ పత్రాలు తమకి కావాలంటే ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకుంటే అప్పుడు కూడా స్పెసిమన్ కాపీలు ఇస్తారు. అవి కూడా ఒరిజినల్ కాదు. ఇప్పటివరకూ మనం ఆస్తి కొంటే అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ స్టాంప్ పేపర్స్ మనకి ఇస్తారు. ఇవి మన దగ్గర ఉంటే ఆ ఆస్తి మనదే అనే నమ్మకం ఉంటుంది. ఎప్పుడైనా అవసరం అయితే ఆ పత్రాలను బ్యాంకులలో లేదా వడ్డీ వ్యాపారుల వద్ద తనఖా పెట్టి డబ్బు తెచ్చుకొని అత్యవసరాలను తీర్చుకొనే అవకాశం ఉంటుంది. కానీ, ఇప్పుడు ఆ ఒరిజినల్ పత్రాలే హక్కు దారులకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.
ఈ కొత్త కార్డ్ ప్రైమ్ అనే విధానంలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కలర్ జిరాక్స్ హక్కు దారుల చేతులో పెడతారు. కావాలని దరఖాస్తు చేసుకుంటే స్పెసిమన్ కాపీలు అందిస్తారు. కనీసం ఈ స్పెసిమన్ కాపీలు అయినా ఒరిజినలేనా అంటే ఇప్పటి వరకూ స్ఫష్టత ఇచ్చే నాధుడే కనిపించడం లేదు. ఈ స్పెసిమన్ కాపీలు బ్యాంకులు యాక్సెప్ట్ చేస్తాయా అంటే ఏ రిజిస్టార్ ఆఫీసులో కూడా స్ఫష్టమైన సమాధానం రావడం లేదు. బయట వడ్డీ వ్యాపారుల వద్ద ఇక అసలు చెల్లె పరిస్థితే లేదు. మనం మన ఆస్తిని అమ్ముకోవాలంటే బహిరంగ మార్కెట్ లో ముందుగా చూసేది ఒరిజినల్ డాక్యుమెంట్.. దానికి లింక్ డాక్యుమెంట్. అవి రెండూ ఇప్పుడు కనిపించవని చెబుతున్నారు. దీంతో అసలు ఆస్తి మన పేరు మీదనే ఉందా.. ఉంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ భద్రంగానే ఉన్నాయా అనే అనుమానం హక్కు దారునికి జీవితాంతం ఉంటుంది.
దీంతో, ప్రభుత్వం వద్దే ప్రజల ఆస్తుల పత్రాలు ఉండడం అనేది ఎంత వరకు సమంజసం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ఈ పత్రాలు ఫిజికల్ గా కాకుండా డిజిటల్ విధానంలో స్టోర్ చేస్తారని అనుకుంటే అది ఇంకా ప్రమాదం. ఎప్పుడు ఎవరు టాంపర్ చేస్తే తమ ఆస్తి పత్రాలు కూడా పోతాయని ప్రజలు నిత్యం భయపడాల్సిన పరిస్థితి. మరి ఇంత రిస్క్ ఉన్నా ప్రభుత్వం ప్రజల ఆస్తుల పత్రాలను తమ ఉంచుకోవాలనుకోవడం చూస్తుంటే.. ప్రభుత్వం వీటిని కూడా తాకట్టు పెట్టి అప్పులు చేసే ఆలోచన ఏమైనా చేస్తున్నదా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.