Leading News Portal in Telugu

Visakhapatnam: విశాఖ సిగలో మరో పర్యాటక మణిహారం


Visakhapatnam: విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతుంది విశాఖ పట్నం. అంతర్జాతీయ స్థాయి నిర్మాణాలతో విశాఖ పోర్టు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ పోర్టు డెవలప్ మెంట్ పై రాష్ట్రం ప్రభుత్వంతో పాటు కేంద్రప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించింది. ఇక కేంద్ర కేంద్ర ఓడరేవులు, జలరవాణా శాఖ మంత్రి శర్భానంద్ సోనోవాల్, సహాయ మంత్రి శ్రీపాద నాయక్ ఇవాళ, రేపు విశాఖలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా విశాఖపట్టణం పోర్టు ట్రస్ట్ అభివృద్ధి ప్రణాళికలపై ఉన్నతాధికారులతో, పలువురు మంత్రులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 333.56 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు కేంద్ర మంత్రులు. ఇక విశాఖ పోర్టుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకు క్రూయిజ్‌ టెర్మినల్‌ రెడీ అయిపోయింది.

పోర్టులోని గ్రీన్‌ చానల్‌ బెర్త్‌లో రూ.96.05 కోట్లతో నిర్మించిన ఈ సముద్ర విహార కేంద్రాన్ని క్రూయిజ్‌ షిప్స్‌తోపాటు భారీ కార్గో నౌకల హ్యాండ్లింగ్‌కు అనుగుణంగా తీర్చిదిద్దారు. అంతర్జాతీయ స్థాయి సముద్ర విహారానికి ఆసక్తి చూపే పర్యాటకుల కోసం ఈ క్రూయిజ్ టెర్మినల్ ను రెడీ చేశారు. ఇకపై పర్యాటకులు దీనిలో వచ్చి విశాఖలో పర్యటించవచ్చు. ఈ టెర్మినల్ నిర్వహణ కోసం ఏపీ టూరిజం శాఖ, కేంద్ర టూరిజం శాఖలు పనిచేయనున్నారు. దీంతో రాష్ట్రంలో ఇంటర్నేషనల్‌ టూరిజం గణనీయంగా పెరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. భారతదేశం ‘బ్లూ ఎకానమీ’ దిశగా అడుగులు వేస్తోందని గత నెలలో విశాకలో జరిగిన గ్లోబల్‌ మారిటైం ఇండియా సమ్మిట్‌ (జీఎంఐఎస్‌)-2023 లో సర్బానంద్ సోనోవాల్ పేర్కొన్నారు. ఇక భారత్‌లో క్రూయిజ్‌ టూరిజానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 7.1 యూఎస్‌ బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ ఉంది. రానున్న పదేళ్లలో 12.1 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా క్రూయిజ్‌ రంగం 1.17 మిలియన్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా పర్యాకట రంగం వృద్ధి చెందటంతో పాటు ఉద్యోగ కల్పన కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.