North Korea: ఉత్తర కొరియా మరసారి తన అణు సమర్థతను చాటుకునేందుకు కీలక చర్యకు పాల్పడింది. తాజాగా ‘వ్యూహాత్మక అణుదాడి’(టాక్టికల్ న్యూక్లియర్ అటాక్) డ్రిల్ చేపట్టినట్లు ఉత్తరకొరియా పేర్కొంది. కిమ్ జోంగ్ ఉన్ గత కొంత కాలంగా అమెరికా, దక్షిణ కొరియాలకు తన అణుక్షిపణులతో సవాల్ విసురుతున్నాడు. అణుయుద్ధం జరిగినప్పుడు ఈ దేశాల నుంచి దాడుల్ని తట్టుకుని వ్యూహాత్మకంగా అణుదాడి ఎలా చేయాలనేదానిపై డ్రిల్స్ నిర్వహించింది.
శనివారం ఈ డ్రిల్‌ని నిర్వహించింది. ఇందులో రెండు లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణులు ఉన్నాయి. దీంతో పాటు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్న నౌకానిర్మాణం, ఆయుధ కర్మాగారాలను తనిఖీ చేసినట్లు ఆ దేశ మీడియా ఆదివారం నివేదించింది. శతృవులను హెచ్చరించేందుకు ఈ డ్రిల్ నిర్వహించినట్లు వెల్లడించింది. న్యూక్లియర్ వార్‌హెడ్లను మోసుకెళ్లే రెండు లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైళ్లను దేశ పశ్చిమ ప్రాంతం నుంచి ప్రయోగించింది. రెండు క్షిపణులు 150 మీటర్ల ఎత్తులో 1500 కిలోమీటర్లు ప్రయాణించాయి.
కిమ్ మెరైన్ ఇంజన్లను ఉత్పత్తి చేసే పుక్‌జంగ్ మెషిన్ కాంప్లెక్స్, ఉత్తరకొరియా నావిక బలగాలను బలోపేతం చేసేందుకు ప్రధాన ఆయుధకర్మాగారాన్ని సందర్శించినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. వర్కర్క్ పార్టీ ఆఫ్ కొరియా సెంట్రల్ కమిటీ భవిష్యత్ ప్లీనరీ సైన్యం ఆధునీకీకరణ, నౌకానిర్మాణ పరిశ్రమల అభివృద్ధిని నిర్దేశిస్తుందని కిమ్ పేర్కొన్నాడని కేసీఎన్ఏ తెలిపింది. దక్షిణకొరియా, అమెరికా చేపడుతున్న జాయింట్ మిలిటరీ విన్యాసాలు ముగిసిన 11 రోజలు తర్వాత ఉత్తర కొరియా ఈ క్షిపణి ప్రయోగాలను చేపట్టింది.