Leading News Portal in Telugu

Taneti Vanita: వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా


విజయవాడలోని సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డు ఫుడ్ జంక్షన్ పార్క్ వద్ద వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి తానేటి వనిత, ఎంపి అయోధ్యరామిరెడ్డి హాజరయ్యారు. స్ధానిక ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, చైర్మన్ భాగ్యలక్ష్మి ఇతర వైసిపి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. పేదల ఆరోగ్యం కోసం ఆలోచించిన మొదటి సీఎం వైఎస్ఆర్ అని హోంమంత్రి కొనియాడారు. మహిళా సాధికారత సాధించేలా సీఎం జగన్ చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా.. రాబోయే ఎన్నికల్లో వైసీపీ శాసనసభ్యులను అందరిని గెలిపించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.

గత ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలే లేవని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. వైద్యం, విద్య ఆ రోజుల్లో ఖరీదుగా ఉండేవని.. వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉచితంగా విద్య, వైద్య అందించిన మహోన్నత వ్యక్తి అని ప్రశంసించారు.
గుండె ఆపరేషన్ల ద్వారా ఎంతోమందికి ప్రాణం పోసిన మహానేత వైఎస్ అని మంత్రి తెలిపారు. వైఎస్ ఎప్పుడు ముఖ్యమంత్రి హోదాలో గర్వం ప్రదర్శించలేదని.. ప్రస్తుతం ఆయన తనయుడు జగన్ ఎక్కడా గర్వం చూపించరని పేర్కొన్నారు.
పేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే జగన్ లక్ష్యమన్నారు.

జగనన్న మ్యానిఫెస్టోలో 25 లక్షల ఇళ్లిస్తామని ఉంటే ఇప్పటిదాకా 32 లక్షల మందికి పైగా పేదలకు ఇళ్ల స్ధలాలిచ్చిన ఘనత జగన్ కే దక్కుతుందని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఆర్థిక పరిస్ధితులను తట్టుకుని జగన్ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. జగన్ తన సంక్షేమ పథకాలతో ప్రజలను సోమరిపోతుల్లా మారుస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని.. మరి ఆనాడు అదే బడ్జెట్ తో టీడీపీ ఎందుకు ఇవ్వలేకపోయిందని మంత్రి ప్రశ్నించారు. అంటే ఆనాడు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి పేదల డబ్బులు అనేది సమాధానం చెప్పాలని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.