Rahul Gandhi: దేశవ్యాప్తంగా ప్రస్తుతం రాజకీయాలు అన్నీ ముందుస్తు ఎన్నికలు, జమిలీ ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి. కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునివ్వడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ‘‘ వన్ నేషన్-వన్ ఎలక్షన్’’ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెడతారనే చర్చ మొదలైంది. దీనికి అనుగుణంగానే కేంద్రం మాజీ రాష్ట్రపతితో ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
ఇదిలా ఉంటే ఒకే దేశం-ఒకే ఎన్నికపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇండియా కూటమికి భయపడే బీజేపీ ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతోందని విమర్శిస్తున్నాయి. కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లవచ్చని, ఈ డిసెంబర్ లో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మమతా బెనర్జీ, నితీష్ కుమార్ వంటి వారు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’’పై స్పందించారు. ఇది భారత సమాఖ్య వ్యవస్థపై దాడిగా అభివర్ణించారు. కేంద్రం ఒకే దేశం-ఒకే ఎన్నికపై ముందుకు వెళ్తున్న సమయంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అనే ఆలోచన భారత యూనియన్, అన్ని రాష్ట్రాలపై దాడి. భారత్ అంటే రాష్ట్రాల సమాఖ్య’’ అని ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
ఏకకాలంలో లోకసభ, అన్ని రాష్ట్రాల ఎన్నికలను నిర్వహించే విషయమై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరికి చోటు కల్పించారు. అయితే తాను ఈ కమిటీలో చేరేది లేదని ఆయన స్పష్టం చేశారు మొత్తం 8 మంది సభ్యులు ఉన్న ఈ కమిటీలో అమిత్ షా, గులాంనబీ ఆజాద్, సంజయ్ కొఠారి, హరీష్ సాల్వే, సుభాష్ కష్యప్, ఎస్కే సింగ్ ఉన్నారు. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశంపై వీలైనంత త్వరగా పరిశీలించి సిఫార్సులు చేయాలని ఎనిమిది మంది సభ్యుల కమిటీని ప్రభుత్వం కోరింది.
INDIA, that is Bharat, is a Union of States.
The idea of ‘one nation, one election’ is an attack on the 🇮🇳 Union and all its States.
— Rahul Gandhi (@RahulGandhi) September 3, 2023