Leading News Portal in Telugu

Woman Stoned To Death: వివాహేతర సంబంధం పెట్టుకుందని మహిళను రాళ్లతో కొట్టి చంపారు..


Woman Stoned To Death: వివాహేతర సంబంధం పెట్టుకుందనే ఆరోపణపై ఒక మహిళలను అత్యంత దారుణంగా చెట్టుకు కట్టేసి రాళ్లతో కొట్టి చంపారు. సభ్యసమాజం తలవంచుకునే ఈ అమానుష ఘటన పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ మహిళను రాళ్లతో కొట్టి చంపినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ ఘటన లాహోర్‌కు 500 కిలోమీటర్ల దూరంలోని పంజాబ్‌లోని రాజన్‌పూర్ జిల్లాలో శుక్రవారం జరిగింది. బాధితురాలిని స్వయంగా ఆమె భర్త, అతని ఇద్దరు సోదరులు కలిసి చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురిచేశారని, రాళ్లతో కొట్టి చంపారని పోలీసులు వెల్లడించారు. నేరం చేసిన తర్వాత సోదరులు పారిపోయారని, పంజాబ్, బలూచిస్తాన్ మధ్య సరిహద్దు ప్రాంతంలో దాక్కున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

పరువు హత్య పేరుతో మహిళలను కొట్టిచంపిన ఘటన పాకిస్థాన్‌లో ఇదే మొదటిది కాదు. పాకిస్థాన్‌లో పరువు పేరుతో ఏటా అనేక మంది మహిళలు హత్యకు గురవుతున్నారు. మానవ హక్కుల కార్యకర్తల అభిప్రాయం ప్రకారం, పాకిస్తాన్‌లో ప్రతి సంవత్సరం 1,000 మంది మహిళలు గౌరవం పేరుతో చంపబడుతున్నారు. బాధితులు తమ ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకోవడం లేదా అక్రమ సంబంధం పెట్టుకోవడం ద్వారా వారి కుటుంబాలకు అవమానం, పరువు పోతోందని కారణంతో ఈ దారుణాలకు ఒడుగడుతున్నారు. వీటిలో కుటుంబ సభ్యులే ఈ తరహా హత్యలకు పాల్పడుతున్న సంఘటనలు అధికంగా ఉండడం గమనార్హం.

కొద్దిరోజుల క్రితమే, 25 ఏళ్ల వైద్యురాలు పరువు హత్యకు గురైంది. తన సహోద్యోగిని పెళ్లి చేసుకోవాలని వైద్యురాలు అనుకోగా.. అందుకు ఆమె తండ్రి ఒప్పుకోలేదు. ఇదే విషయంలో అమీతుమీ తేల్చుకునేందుకు వైద్యశాలకు వచ్చిన ఆమె తండ్రి వాగ్వాదానికి దిగాడు. కోపంతో రెచ్చిపోయిన తండ్రి తుపాకీ తీసి కూతుర్ని కాల్చి చంపేశాడు. పాకిస్థా్న్‌లో మహిళల దయనీయ పరిస్థితికి ఈ పరువు హత్యలు అద్దంపడుతున్నాయని, మహిళలను రెండో తరగతి పౌరులుగా చూస్తూ వారి హక్కులను కాలరాస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరహా దాడులు ఎక్కువ అవుతుండడంతో మహిళా భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పౌర హక్కుల నేతలు డిమాండ్ చేస్తు్న్నారు.