Leading News Portal in Telugu

Heavy Rains: మరో రెండు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలపై తీవ్ర ప్రభావం


Heavy Rains: ఆ మధ్య వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి.. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా భిన్నంగా తయారైంది.. ఇది వర్షాకాలమా? లేదా? ఎండకాలమా? అని అర్థం కాని పరిస్థితి.. వర్షాలు దంచి కొట్టాల్సిన సమయంలో.. ఉక్కపోత, తీవ్రమైన ఎండలతో వేసవి సమయంలో నమోదైన కరెంట్‌ డిమాండ్‌ను కూడా ఆగస్టు నెల అధిగమించింది.. అయితే, ఇప్పుడు మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.. ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆదివారం కూడా కొనసాగింది. ఇది సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉందని.. దీని ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతం, పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

అయితే, ఈ అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది వాతావరణశాఖ.. రాష్ట్రంలోని ఉత్తర ప్రాంత జిల్లాల్లోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షసూచన నేపథ్యంలో ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం, సిద్దిపేట ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇక, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావారణశాఖ.. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు.. ఏపీలోనూ పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం విదితమే. ఇక, వర్షం కారణంగా నేడు రాయలసీమ జోన్ ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు వాయిదా వేశారు.. ఇవాళ జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షలు.. ఈనెల 21 తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు ఉన్నతాధికారులు.