Leading News Portal in Telugu

Warangal: పోలీసుల ముందే బైక్‌కు నిప్పు పెట్టిన వ్యక్తి.. కారణం ఏంటంటే?


Man was caught drunk and driving and set his bike on fire: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుపడితే.. కొందరు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు లేదా వాగ్వాదానికి దిగుతారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తన ద్విచక్ర వాహనానికి ట్రాఫిక్‌ పోలీసుల ఎదుటే నిప్పు అంటించాడు. మంటలను ఆర్పిన పోలీసులు వాహనాన్ని సీజ్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన తెలంగాణలోని వరంగల్‌లో చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్‌ ట్రాఫిక్‌ ఎస్సై రవి ఆధ్వర్యంలో శనివారం రాత్రి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. శివనగర్‌ ప్రాంతానికి చెందిన పులిశేరు శివ పూటుగా మద్యం తాగి తన ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేస్తున్నారని గ్రహించిన శివ.. ప్రధాన తపాలా కేంద్రం కూడలి రహదారి పక్కన ద్విచక్ర వాహనం నిలిపి రోడ్డు దాటుతుండగా పోలీసులు పట్టుకున్నారు. మద్యం తాగి వాహనం నడుపుతూ వచ్చావని, కేసు నమోదు చేస్తామని పోలీసులు అందడంతో శివ ఆవేశానికి గురయ్యాడు.

శివ తన ద్విచక్ర వాహనం పెట్రోల్‌ పైపును తొలగించి.. నిప్పు పెట్టాడు. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ట్రాఫిక్‌ పోలీసులు పక్కనే ఉన్న దుకాణంలో నుంచి నీళ్లు తెచ్చి మంటలు ఆర్పేశారు. ఆపై శివ ద్విచక్ర వాహనాన్ని సీజ్‌ చేసి.. వరంగల్‌ రైల్వే స్టేషన్‌ పార్కింగ్‌ కేంద్రానికి తరలించారు. అయితే తాను వాహనం నడుపుతూ దొరక లేదని, కేసు ఎలా నమోదు చేస్తారని శివ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఇందుకు సంబందింసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.