Leading News Portal in Telugu

Jasprit Bumrah: తండ్రైన జస్ప్రీత్ బుమ్రా.. అప్పుడే పేరు కూడా పెట్టేశాడు!


Jasprit Bumrah and Sanjana Ganesan Welcome Baby Boy: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తండ్రయ్యాడు. బుమ్రా సతీమణి, స్టార్ స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్ పండంటి మగబిడ్డకు సోమవారం ఉదయం జన్మనిచ్చారు. ఈ విషయాన్ని బుమ్రా స్వయంగా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికల ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. బుమ్రా తన కుమారుడి చేతి ఫొటో పోస్ట్ చేయడమే కాకుండా.. అంగద్ అని పేరు పెట్టినట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అయింది. సంజనా గణేశన్‌ను బుమ్రా 2021 మార్చిలో వివాహం చేసుకున్నాడు.

‘మా చిన్ని ‘కుటుంబం ఇప్పుడు పెద్దదైంది. మా మనసులు ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నాయి. ఈ రోజు ఉదయమే మా అబ్బాయి అంగద్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ ప్రపంచంలోకి వచ్చాడు. మా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మా జీవితంలో వచ్చే కొత్త ఆనందాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాము’ అని జస్ప్రీత్ బుమ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. సతీమణి, కుమారుడి చేతిలో తన చేయి పెట్టుకున్న ఫొటోను బూమ్ బూమ్ పోస్ట్ చేశాడు. విషయం తెలిసిన ఫాన్స్.. బుమ్రాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఆసియా కప్‌ 2023లో నేడు నేపాల్‌తో మ్యాచ్ ఆడాల్సిన జస్ప్రీత్ బుమ్రా ఉన్నపళంగా ఆదివారం శ్రీలంక నుంచి ముంబై వచ్చాడు. దీంతో మళ్లీ బుమ్రాకు గాయమైందా? లేదా కుటుంబ సభ్యులలో ఎవరికైనా అనారోగ్యం బాలేదా? అని చాలా మంది ఫాన్స్ టెన్షన్ పడ్డారు. అయితే అతని భార్య సంజనా గణేశన్ డెలివరీ ఉన్నట్లు తెలిసి అందరూ కూల్ అయ్యారు. ఇక నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లో బుమ్రా స్థానంలో వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.