Leading News Portal in Telugu

MK Stalin: “ఇండియా గెలవాలి”.. లేదంటే మణిపూర్, హర్యానా గతే..


MK Stalin: ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విమర్శలు చేశారు. ‘స్పీకింగ్ ఫర్ ఇండియా’ అనే పోడ్‌కాస్ట సిరీస్ తొలి ఎపిసోడ్ లో బీజేపీపై విమర్శలు గుప్పించారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందూ భాషల్లో విడుదలైన ఈ సిరీస్ లో స్టాలిన్ మాట్లాడుతూ.. గత 9 ఏళ్లలో బీజేపీ ఏ హామీని నెరవేర్చలేదని అన్నారు. ప్రజల అకౌంట్లలో రూ.15 లక్షలు జమచేస్తానని చెప్పడం, రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందనే హామీ ఇవ్వడం, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇవేవీ జరగలేదని స్టాలిన్ విరుచుకుపడ్డారు.

భారతదేశం మొత్తం మణిపూర్, హర్యానాల కాకూండా నిరోధించాలంటే ‘ఇండియా కూటమి’ తప్పక గెలవాలని అన్నారు. మణిపూర్ జాతుల మధ్య ఘర్షణ, హర్యానా నూహ్ లో మతకలహాలను గురించి ప్రస్తావించారు. ప్రజలు ‘బహుళ సాంస్కృతిక, వైవిధ్యభరితమైన భారతదేశాన్ని రూపొందించాలి’’ అని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంస్థల్ని స్నేహితులకు కట్టబెట్టడం, ఎయిర్ ఇండియాను అమ్మడాన్ని కప్పిపుచ్చుకునేందుకు మోడీ సర్కార్ మతవాదాన్ని ఆశ్రయించిందని ఆరోపించారు. పోర్టులు, విమానాశ్రయాలు తమకు దగ్గరగా ఉన్న కార్పొరేట్లకు మోడీ సర్కార్ కట్టబెట్టిందని విమర్శించారు.

2002 గుజరాత్ అల్లర్లను కూడా స్టాలిన్ ప్రస్తావించారు. సామాజిక న్యాయం, సామాజిక సామరస్యం, సమాఖ్య, లౌకిక రాజకీయాలు, సోషలిజం పునరుద్ధరణ కోసం ఇండియా కూటమి ఏర్పడిందని, ఇండియా కూటమి గెలవకపోతే భారతదేశాన్ని ఎవరూ రక్షించలేరని హెచ్చరించారు. ఫెడరలిజానికి ముప్పు వచ్చినప్పుడల్లా డీఎంకే ముందుంటుందని స్టాలిన్ అన్నారు.

మతం, కులం, భాషల ఆధారంగా దేశాన్ని విభజించేది డీఎంకే పార్టీ అని బీజేపీ ఎదురుదాడికి దిగింది. తమిళనాడుకు పన్ను ఆదాయంలో కేంద్ర తగిన ఆదాయం ఇచ్చిందని బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి అన్నారు. డీఎంకేని ఉద్దేశిస్తూ కనీసం ఇప్పటికైనా స్టాలిన్ భారతదేశాన్ని ఒక దేశంగా ఒప్పుకున్నందుకు సంతోషం అని అన్నారు.