Leading News Portal in Telugu

Apple Watch: మరోసారి ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్


Apple Watch: ప్రీమియం బ్రాండ్ స్మార్ట్‌వాచ్‌లు అద్భుతమైన హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లతో వస్తాయి. ఇవి యూజర్ల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడూ పర్యవేషిస్తుంటాయి. ఏవైనా అనారోగ్యాలను గుర్తిస్తే, అలర్ట్ ఇస్తాయి. ఇప్పటికే యాపిల్‌ వాచ్‌లు ఇలాంటి హెచ్చరికలతో ఎంతోమంది యూజర్ల ప్రాణాలు నిలబెట్టాయి. అయితే అలాంటి మరో ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. యూఎస్‌లోని విస్కాన్సిన్‌లో యాపిల్ వాచ్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ తన ప్రాణాలను రక్షించే సామర్థ్యాలను మరోసారి నిరూపించుకుంది.

గురువారం తెల్లవారుజామున 4గంటలకు రోడ్డు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రోడ్డుకు 100 అడుగుల దూరంలో వాహనం తలక్రిందులుగా పడిపోయింది. డ్రైవర్‌ స్పృహ తప్పి అలానే ప్రాణాపాయ స్థితిలో పడిపోయాడు. అదృష్టవ శాత్తూ యాపిల్ వాచ్‌ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ వెంటనే స్పందించింది. ఆ ఫీచర్‌ ద్వారా వెంటనే 911 ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్‌ వెళ్లింది. వెంటనే అత్యవసర విభాగానికి చెందిన అధికారులు స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు యూనియన్ గ్రోవ్-యార్క్‌విల్లే ఫైర్ డిపార్ట్‌మెంట్ నుంచి సహాయాన్ని అభ్యర్థించారు. హెలికాప్టర్ ద్వారా బాధితుడిని తరలించేందుకు ల్యాండింగ్ జోన్‌ను ఏర్పాటు చేశారు. తీవ్ర గాయాల పాలైన డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. యాపిల్ వాచ్‌ అతడి ప్రాణాలను కాపాడింది.

కాన్సాస్విల్లే ఫైర్ అండ్ రెస్క్యూ డిపార్ట్‌మెంట్ చీఫ్ రోనాల్డ్ మోల్నార్ మాట్లాడుతూ.. ఈ ఘటనలో యాపిల్‌ వాచ్‌ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఆపిల్ వాచ్ లేకుంటే తాము ఘటనాస్థలికి చేరుకోవడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టి ఉండేదని ఆయన పేర్కొన్నారు. యాపిల్‌ వాచ్‌ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ కారు ప్రమాదాన్ని గుర్తించినప్పుడు ఎమర్జెన్సీ SOSని యాక్టివేట్ చేయడం ద్వారా పనిచేస్తుంది. వినియోగదారు నోటిఫికేషన్‌కు ప్రతిస్పందించకపోతే, పరికరం స్వయంచాలకంగా అత్యవసర సేవలకు కాల్ చేస్తుంది. వినియోగదారు ఖచ్చితమైన స్థానాన్ని పంపినవారితో పంచుకుంటుంది. ఈ ఫీచర్‌ వ్యక్తి ప్రాణాలను కాపాడడంలో సహాయపడుతుంది.