Leading News Portal in Telugu

Hyderabad Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. నాలాలో పడిపోయిన 55 ఏళ్ల మహిళ!


Woman Fell in to Hussain Sagar Nala at Gandhinagar: హైదరాబాద్‌లో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరు వేగంగా ప్రవహిస్తోంది. భారీ వర్షానికి జన జీవనం పూర్తిగా అస్తవ్యస్తం అయ్యింది. ఈ క్రమంలో హైదరాబాద్ గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. హుస్సేన్ సాగర్ నాలాలో పడి ఓ మహిళ గల్లంతైంది. తన అమ్మ కనిపించడం లేదని సదరు మహిళ కుమార్తె గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్‌బీఐ కాలనీ దామోదరం సంజీవయ్య నగర్‌లో లక్ష్మీ (55) అనే మహిళ ఉంటుంది. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. ముగ్గురుకి వివాహం అవ్వడంతో ఇంట్లో ఆమె ఒంటరిగా ఉంటోంది. ఇటీవల వర్షానికి గోడ కూలిపోవడంతో.. ప్రహరీ లేక లక్ష్మీ ఇబ్బందులు పడుతోంది. అయితే ఆమె కనిపించకుండా పోయింది. ఇంటి వద్ద పగిలిన గాజులు కనిపించడంతో.. నాలాలో పడిపోయినట్లు కుటుంబ సభ్యుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

లక్ష్మి ఇంట్లో గ్యాస్ స్టవ్‌పై వంట చేస్తోంది. బియ్యం గిన్నె స్టవ్‌పై ఉంది. అలానే సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టి ఉండడం, అక్కడే చెప్పులు కూడా ఉండడంతో.. ఆమె హుస్సేన్ సాగర్ నాలాలో పడిపోయినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గాంధీనగర్ పోలీసులకు లక్ష్మీ కుమార్తె సునీత ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లక్ష్మి కోసం గాలింపులు చేపట్టారు.

లక్ష్మి కూతురు సుకన్య ఎన్‌టీవీతో మాట్లాడుతూ… ‘మా అమ్మ హుస్సేన్ సాగర్ నాలాలో పడి గల్లంతయింది. నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి కనిపించకుండాపోయింది. మా అమ్మ ఆచూకీ కోసం గాంధీనగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసాము. మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నమని పోలీసులు చెప్పారు. మా కిచెన్ ప్రహరీ వద్ద పగిలిన గాజులు కనిపించడంతో అమ్మ నాలాలో పడిపోయినట్లు అనుమానంగా ఉంది. రిటేయినింగ్ వాల్ లేక ఇబ్బందులు పడుతున్నాము. గత రెండు సంవత్సరాలుగా ఇంటికి టాయిలెట్ లేక మా అమ్మ ఇబ్బందులు పడుతుంది. మాకు వివాహం అవడంతో ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటోంది. అధికారులు, పోలీసులు స్పందించి మా అమ్మ ఆచూకీ తెలపాలని వేడుకుంటున్నాం’ అని అన్నారు.

మహిళ గల్లంతు అనే వార్త ఎన్‌టీవీలో ప్రసారంతో అధికార యంత్రాంగం, పోలీసులు హుటాహుటిన లక్ష్మి ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. మహిళ ఆచూకీ కోసం ముడు ఢీఆర్‌ఎఫ్ బృందాలు నాలా రూట్ మ్యాప్ చూస్తూ గాలిస్తున్నాయి.