Leading News Portal in Telugu

Heavy to Very Heavy Rains: వరుసగా ఐదు రోజులు భారీ వర్షాలు.. అన్ని జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్ జారీ..


Heavy to Very Heavy Rains: చాలా కాలం పాటు జాడ లేకుండా పోయిన వర్షాలు మళ్లీ దంచికొడుతున్నాయి.. హైదరాబాద్‌ సహా తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా ప్రకటించింది.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా.. ఈశ్యాన మధ్య బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడింది.. ఉపరితల ఆవర్తనం.. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండగా.. హైదరాబాద్ పరిసర జిల్లాలు మినహా మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.. ఉత్తర, ఈశ్యాన జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి.. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలపడుతోందని.. మరో 24 గంటల్లో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారుతుందని అమరావతి విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది.. ఉత్తర కోస్తా నుంచి తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉందని.. వచ్చే నాలుగు రోజుల పాటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఒకటి, రెండు చోట్ల అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని వార్నింగ్‌ ఇచ్చింది. సముద్రం మధ్య, తీరం వెంబడి బలమైన గాలులు వీస్తుండగా.. మత్య్స కారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం.