భూములు తెగనమ్మెందుకు కుట్ర!.. అమరావతి వినాశనమే జగన్ అజెండా?! | jagan sarkar agenda annihilation of amarawati| capital| land| auction| gos
posted on Sep 4, 2023 1:27PM
ఏపీ రాజధాని అమరావతి.. ఈ మాట వినేందుకు కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. అందుకే ఏపీకి మూడు రాజధానులు అనే కొత్త నినాదాన్ని అందుకున్నారు. రాజధానిగా అమరావతి ఉండేందుకు జగన్ మోహన్ రెడ్డికి ఇష్టం లేదన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత నాలుగేళ్లుగా అందరూ అంటున్నది. వింటున్నది అదే. ఏది ఏమైనా అమరావతి రాజధాని కాకూడదన్నదే వైసీపీ నినాదం, విధానం. అజెండా. ఇందుకోసం కమ్మ రాజధాని, రాజధాని భూములలో అవినీతి, రాజధాని కట్టేందుకు నిధులు లేవు.. ఇలా ఎన్నో ఎన్నెన్నో కారణాలు చెబుతూ సీఎం జగన్ ఇప్పటి వరకూ కాలం గడిపేశారు.
సీఎంగా జగన్ ఇప్పుడు అమరావతిని అభివృద్ధి చేసినా ఆ రాజధాని క్రెడిట్ అంతా అందుకు పునాది రాయి వేసిన చంద్రబాబుకే వెళ్తుంది. ముందు ముందు తరాలు అమరావతి చరిత్ర తీస్తే ముందు పేరు చంద్రబాబుదే వస్తుంది. ఆ కారణంగానే జగన్ అమరావతి అంటేనే ముఖం చిట్లిస్తున్నారు. దానిని నిర్వీర్యం చేయడానికి రాష్ట్ర ప్రగతిని, ప్రయోజనాలనూ కూడా పక్కన పెట్టేశారు. సవాలక్ష కారణాలు చెబుతూ అమరావతిని నాశనం చేస్తున్నారు. వైసీపీ నేతలు సైతం అమరావతి రాజధానిగా ఒప్పుకొనే పరిస్థితిలో లేరు. కోర్టులు మొట్టికాయలు వేసినా.. అమరావతి రైతులు తమ బాధ ఎన్ని రకాలుగా విన్నవించుకున్నా దున్నపోతు మీద వర్షం కురిసినట్లు ప్రభుత్వంలో చలనమే లేదు. అందుకే జగన్ సర్కార్ అధికార పగ్గాలు చేపట్టీ పట్టడంతోనే అమరావతిని స్మశానంతో పోల్చారు. అంతకు ముందు రేయింబవళ్లు పెద్దఎత్తున సాగిన రాజధాని నిర్మాణ పనులను ఎక్కడిక్కడ నిలిపేశారు. గతంలో చంద్రబాబు దేశ విదేశాల కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసి వారిని వెళ్లగొట్టారు. అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ సర్కార్ ఈ నాలుగేళ్ళలో ఒక్క ఇటుక పెట్టిన పాపాన పోలేదు. మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకూ మభ్య పెట్టడమే తప్ప ఒక్క రాజధానికి కూడా కనీసం భూమి పూజ చేసిన పాపాన కూడా పోలేదు.
గత ప్రభుత్వం మొదలు పెట్టిన నిర్మాణాలు ఈ నాలుగేళ్ల కాలంలో శిథిల దశకు చేరుకుంటున్నా పట్టించుకో లేదు. గత ప్రభుత్వం మాదిరి ఈ ప్రభుత్వం కూడా రాజధాని అమరావతిని పట్టించుకుని ఉండే ఇప్పటికే దాదాపుగా పనులు పూర్తయ్యేవి. లక్షల కోట్లతో మొదలైన అమరావతి.. ఇప్పటికే వేలకోట్ల సంపద సృష్టించే నగరంగా మారి ఉండేది. కానీ, కక్ష పూరిత విధానాలతో ఈ ప్రభుత్వం రాజధానిని నాశనం చేయడమే కాకుండా.. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వం వచ్చినా అమరావతి ముందుకు కదలకుండా ఉండేందుకు రకరకాల కుయుక్తులు పన్నుతోంది. ఇం దులో భాగంగానే ఇప్పటికే రాజధాని ప్రాంతంలో పేదలకు పట్టాలిస్తాం.. ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం పన్నిన కుట్రను కోర్టులు భగ్నం చేశాయి. ప్రస్తుతం ఈ పట్టాలు, ఇళ్ల నిర్మాణం వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. ఆ విషయంలో నవంబర్ వరకూ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి వీల్లేకుండా దేశ సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది.
ఇళ్ల పట్టాలు, గృహనిర్మాణాల కుట్రను కోర్టు భగ్నం చేయడంతో జగన్ ప్రభుత్వం ఇప్పుడు మరో కుట్రకు తెరతీసింది. ఏకంగా ఆదాయం కోసం అమరావతి భూములను తెగనమ్మేందుకు నడుం బిగించింది. తాజాగా రాజధానిలో భూముల అమ్మకం కోసం జగన్ ప్రభుత్వం రెండు (389, 390) జీవోలు జారీ చేసింది. రాజధాని మాస్టర్‌ప్లాన్ ప్రకారం స్పెషల్ జోన్లో ఉన్న మంగళగిరి మండలం నవులూరు రెవెన్యూలో పది ఎకరాలు, తుళ్ళూరు మండలం పిచుకలపాలెం రెవెన్యూలో నాలుగు ఎకరాలను అమ్మకానికి పెట్టారు. స్పెషల్ జోన్లో ఉన్న రాజధాని భూములను ఈ-వేలం ద్వారా అమ్మేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం కోర్ క్యాపిటల్‌లో రెండు చోట్ల 14 ఎకరాలను ఎంపిక చేసిన ప్రభుత్వం.. నవులూరులో ఎకరా 5.94 కోట్లు, పిచ్చికలపాలెంలో 5.41 కోట్లుగా ధర నిర్ణయించింది. ఈ మేరకు సీఆర్డీఏ వేలం ప్రకటన జారీ చేసింది.
అయితే అమరావతి అభివృద్ధి కోసమే తాము భూముల వేలానికి పెడుతున్నట్టు సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. ఇలా అమరావతి భూములను వేలానికి పెట్టడం ఇప్పుడేం కొత్త కాదు. గతంలోనూ ఇలాగే వేలం ప్రకటన చేశారు. కానీ స్పందన లేక ఆగిపోయారు. ఇప్పుడు ఈ వేలానికి వచ్చే స్పందనకు అనుగుణంగా తదుపరి ప్రణాళికలను రచించనున్నారు. అంటే ఈ భూముల వేలానికి వచ్చే స్పందనను బట్టి మిగతా భూములను కూడా వేలం వేయనున్నట్లు ప్రభుత్వం చెప్పకనే చెబుతోంది. మరోవైపు వేలం పేరిట ప్రకటనను ఇచ్చేసి.. కోట్లు పలికే ఆ భూములను తమ వారికి అప్పనంగా కేటాయించే ఆలోచనలో ఉన్నారా అన్న అనుమానాలు కూడా రాజకీయ సర్కిల్స్ లో వ్యక్తమవుతున్నాయి. మరి భేముల వేలం ప్రకటనకు వచ్చే స్పందన ఎలా ఉంటుందో? ఈ ప్రకటనపై అమరావతి రైతుల రియాక్షన్ ఏమిటో చూడాల్సి ఉంది. అసలు రాజధాని వేలం ప్రకటనపై అమరావతి రైతులు కోర్టుకు వెల్లి స్టే తెచ్చుకునే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు.