Leading News Portal in Telugu

Roger Binney: పాక్ లో అడుగుపెట్టిన బీసీసీఐ చీఫ్


పాక్ క్రికెట్‌లో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దశాబ్దాల తర్వాత భారత క్రికెట్ బోర్డు నుంచి ఇద్దరు ప్రముఖులు, పాకిస్తాన్‌లో పర్యటించారు. ఆసియా కప్ 2023 టోర్నీ ఆరంభ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా.. బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షాకి ఆహ్వానం పంపించారు. అయితే భారత హోం శాఖ మంత్రి అమిత్ షా కొడుకైన జై షా, పాక్ లో అడుగుపెడితే అది రెండు దేశాల్లో చాలా పెద్ద చర్చకు దారి తీసే ఛాన్స్ ఉంది. దీంతో జై షా స్థానంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఆసియా కప్ ఆరంభ వేడుకల్లో పాల్గొనబోతున్నారనే టాక్ వచ్చింది.

అయితే.. వీసా క్లియరెన్స్ ఆలస్యం కావడంతో నేడు (సోమవారం) బీసీసీఐ ప్రెసిడెంట్, వైఎస్ ప్రెసిడెంట్ పాకిస్తాన్ కు చేరుకున్నారు. ఈ ఇద్దరూ వాగా బార్డర్ ద్వారా జెడ్ ప్లస్ సెక్యూరిటీతో పాక్ కు వెళ్లారు. రేపు లాహోర్‌లో ఆఫ్ఘనిస్తాన్- శ్రీలంక మధ్య గ్రూప్ బీ మ్యాచ్ జరుగనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 6న పాకిస్తాన్, గ్రూప్ బీ2 టీమ్‌ మధ్య సూపర్ 4 మ్యాచ్ కొనసాగనుంది.

ఇక, ఈ రెండు మ్యాచ్ లకు ముఖ్య అతిథులుగా రోజర్ బిన్నీ, రాజీవ్ శుక్లా హాజరుకానున్నట్లు సమాచారం. బీసీసీఐ ప్రముఖుల కోసం పాక్ క్రికెట్ బోర్డు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. పాకిస్తాన్‌లో రెండు రోజుల పర్యటన పూర్తిగా క్రికెట్ సంబంధితమైనదే.. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవు.. బీసీసీఐ తరుపున లాహోర్‌లో ఓ డిన్నర్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇందులో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు, బోర్డు సభ్యులు పాల్గొంటారు అని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ పేర్కొన్నారు. పాకిస్తాన్‌లోని లాహోర్‌లో క్రికెట్ మ్యాచ్ చూసేందుకు ఎదురుచూస్తున్నానంటూ బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ తెలిపారు.

బీసీసీఐ నుంచి ఇద్దరు ప్రముఖులు, పాకిస్తాన్‌కి వెళ్లడంతో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గురించి చర్చ స్టార్ట్ అయింది. షెడ్యూల్ ప్రకారం 2025లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకుంది. అయితే పాక్‌లో అడుగుపెట్టేందుకు బీసీసీఐ ఒప్పుకోకపోవచ్చు. ఇక, పాకిస్తాన్‌ నుంచి బీసీసీఐ ప్రముఖులు క్షేమంగా తిరిగి వెళ్తే.. ఈ విషయాన్ని ఐసీసీకి పాక్ నివేదికగా సమర్పించే ఛాన్స్ ఉంది. బీసీసీఐ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ క్షేమంగా పాకిస్తాన్‌కి వచ్చి వెళ్లినప్పుడు, భారత క్రికెట్ జట్టుకి ఇక్కడ వచ్చిన ప్రమాదం ఏంటని బీసీసీఐని నిలదీసే ఛాన్స్ పీసీబీకి ఉంటుంది.