ఓయ్ ముద్దపప్పు.. నోరు లేస్తోంది.. సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు.. కాస్త నోరు అదుపులో పెట్టుకో’ అంటూ వైసీపీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో కొత్త ట్రాక్టర్లు పదింటిని భరత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో ఎంపీ. భరత్ మాట్లాడుతూ మిడ్ నైట్ పాదయాత్ర చేసే ముద్ద పప్పు గురించి ఎక్కువ మాట్లాడి తన స్థాయిని దిగజార్చుకోవడం ఇష్టం లేదు అని ఆయన అన్నారు.
కాకపోతే ఒకటే హెచ్చరిక అని సీఎం జగన్మోహన్ రెడ్డిపై అవాకులు, చెవాకులు.. కించపరిచే పదాలు వాడితే అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎంపీ మార్గాని భరత్ హెచ్చరించారు. ఎమ్మెల్యే కాదు కదా కనీసం వార్డు మెంబరుగా కూడా గెలవలేని నువ్వు ఏ అర్హతతో పాదయాత్ర నిర్వహిస్తున్నావని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ మనుమడు, చంద్రబాబు కొడుకు, బాలకృష్ణ అల్లుడిగా తప్పిస్తే.. ప్రత్యక్ష ఎన్నికలలో ఎప్పుడైనా నెగ్గావా లోకేష్ అంటూ రాజమండ్రి వైసీపీ ఎంపీ ప్రశ్నించారు. మీ నాన్న అధికారంలో ఉండగా అడ్డదార్లలో ఎమ్మెల్సీ, ఆ పదవి పట్టుకుని మంత్రి పదవి వెలగబెట్టావే కానీ..నీకున్న అర్హత ఏమిటని ఎంపీ భరత్ ప్రశ్నించారు.
అసలు నీ పాదయాత్ర లక్ష్యం ఏమిటో నీకైనా తెలుసా.. యువగళమా.. గందరగోళమా అని ఎంపీ మార్గాని భరత్ ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాదిరిగా పాదయాత్ర చేయాలే తప్పిస్తే.. అర్ధరాత్రి మూడింటికి పాదయాత్ర ఏమిటని ప్రశ్నించారు. నైట్ వాక్, మిడ్ నైట్ వాక్ వల్ల ప్రజలకు ఉపయోగం ఉండదని.. నీకైతే వళ్ళు, కొవ్వు తగ్గి ఉపయోగమే అంటూ ఎంపీ మార్గాని సెటైర్లు వేశారు. ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డిని కించపరిచే పదజాలం ఉపయోగిస్తే నువ్వూ, నీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.. జాగ్రత్త అంటూ ఘాటుగానే ఎంపీ భరత్ వార్నింగ్ ఇచ్చాడు.