తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు | heavy rains in telugu states| orange| yellow| alert| imd| projects| inflow
posted on Sep 5, 2023 7:25AM
నెల రోజుల విరామం అనంతరం తెలుగు రాష్ట్రాలలో వర్షాల జోరు మొదలైంది. గత రెండ్రోజులుగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం కోస్తాంధ్రకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో మంగళ, బుధవారాలలో (సెప్టెంబర్ 5, సెప్టెంబర్ 6) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
దక్షిణ కోస్తా జిల్లాల్లో బుధవారం (సెప్టెంబర్ 6) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే కోస్తాంధ్ర, రాయలసీమలో మంగళవారం (సెప్టెంబర్ 6) భారీ వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది. రాబోయే రెండ్రోజుల్లో 11.56 సెంమీ నుంచి 20.44 సెంమీ వరకు రికార్డు స్థాయి వర్షపాతం నమోదయ్యే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది.
ఇక తెలంగాణలోనూ వర్షాల దంచి కొడుతున్నాయి. ఉపరితల అవర్తనం మంగళవారానిని అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తెలంగాణలో మరో ఐదు రోజులు, ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే కురుస్తున్న వానలతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్, మరో 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జగిత్యాల, వికారాబాద్, కరీంనగర్, సంగారెడ్డి, మెదక్, మెహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మంగళవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇక కోస్తా ఆంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడావాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఏపీ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో వాన బీభత్సం సృష్టించింది. నామనంక పల్లి దగ్గర వాగులు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక హైదరాబాద్ లో సోమవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచింది. మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.