Udhayanidhi Stalin: తమిళనాడు మాంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని చెబుతూ.. దాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చడంపై పలు హిందూ సంఘాలు, బీజేపీ ఫైర్ అవుతున్నాయి. బీజేపీ అగ్రనేతలు కూడా ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా కూటమిలో డీఎంకే భాగస్వామిగా ఉండటంతో హిందూమతంపై ఇండియా కూటమి వైఖరి చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ అయోధ్యలోని తపస్వీ చావ్నీ ఆలయ ప్రధాన అర్చకుడు పరమహంస్ ఆచార్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి స్టాలిన్ తలనరికితే రూ. 10 కోట్లు ఇస్తానని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై ఉదయనిధి స్పందించారు. రూ.10 కోట్లు ఎందుకు, నా తల దువ్వుకోవడానికి రూ.10 దువ్వెన చాలు అంటూ కౌంటర్ ఇచ్చారు. తమిళంలో చాప్, స్లైస్ అనే పదాలకు జట్టు దువ్వడం అనే అర్థం కూడా ఉంది. సనాతన ధర్మం గురించి మాట్లాడినందుకు యూపీకి సాధువు నా తల షేవ్ చేయడానికి రూ. 10 కోట్లు ప్రకటించారని, నా తల దువ్వు కునేందుకు రూ. 10 దువ్వెన సరిపోతుందని ఉదయనిధి బెదిరింపులను తెలిగ్గా తీసిపారేశారు.
ఈ బెదిరింపులు మాకు కొత్త కాదని.. తమిళం కోసం రైల్వే ట్రాక్ పై తలపెట్టిన కళాకారుడి( కరుణానిధి) మనవడినని ఆయన అన్నారు. కరుణానిధి తమిళనాడు రాష్ట్రానికి ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సీఎం ఎంకే స్టాలిన్ తండ్రి పెరియార్ ప్రారంభించిన బ్రహ్మణ వ్యతిరేక ద్రావిడ ఉద్యమానికి నాయకత్వం వహించారు. సాధువు చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ఆయన నిజమైన సాధువా..? డూప్లికేటా..? ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు..? నా తల ఎందుకు అంతగా నచ్చింది..? అంటూ సెటైర్లు వేశారు.