GVL Narasimha Rao: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.. విశాఖపట్నంలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. ఉదయనిధి కామెంట్స్‌ను తప్పుబట్టారు.. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలకు ఇండియా కూటమికి బాధ్యత వహిస్తున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ బచ్చాగాళ్లు సనాతన ధర్మాన్ని కరోనాతో పోలిస్తే దాని ఖ్యాతి ఎక్కడ తగ్గదన్న ఆయన.. రాజకీయ దురుద్దేశంతో తప్పుడు వ్యాఖ్యలు చేసి ఆత్మాభిమానం దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఉదయనిధి వ్యాఖ్యలు దురుద్దేశంతో చేసినవి అని దుయ్యట్టారు. యాంటీ ఇండియా అలయన్స్ దురుద్దేశం, అజెండాలో భాగమే ఈ వ్యాఖ్యలు వెనుక అంతరార్ధం అన్నారు. గెలిచే సత్తా లేమని తెలిసి ఓటు బ్యాంకు పెంచుకునే దుర్భిద్ధిలో భాగమే నంటూ విమర్శలు గుప్పించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
కాగా, తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, మంత్రి, నటుడు ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం విదితమే.. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటివని.. దీనిని పూర్తిగా నిర్మూలించాలని ఆయన కుండబద్దలు కొట్టడంతో.. దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదురైంది. ముఖ్యంగా.. హిందూ సంఘాలు, బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.. అయితే, మరోసారి మీడియా ముందుకొచ్చి.. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు ఉదయనిధి. తాను కేవలం కుల భేదాలను మాత్రమే ఖండించానని స్పష్టం చేసిన ఆయన.. తాను మళ్లీ మళ్లీ అదే చేస్తానని బాంబ్ పేల్చిన విషయం విదితమే. నేను కేవలం ఒక్క హిందూ మతం మీదే వ్యాఖ్యలు చేయలేదు. అన్ని మతాలను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేస్తున్నానను. నేను కుల భేదాల్ని మాత్రమే ఖండిస్తూ మాట్లాడాను. అంతే’’ అంటూ ఉదయనిధి తాజాగా స్పష్టం చేసిన విషం విదితమే. అయితే, బీజేపీ నేతలు తనని ‘ఉదయనిధి హిట్లర్’గా అభివర్ణించడంతో పాటు ఇండియా కూటమిని హిందూ వ్యతిరేకి అని నిందిస్తున్న నేపథ్యంలో.. ఉదయనిధి స్టాలిన్ ఘాటుగా బదులిచ్చారు.