Leading News Portal in Telugu

CMD Raghumareddy: విస్తారంగా వర్షాలు.. కరెంట్‌ తో జాగ్రత్త అంటున్న అధికారులు


CMD Raghumareddy: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి సూచించారు. ఈ మేరకు మంగళవారం సమీక్ష నిర్వహించారు. టీఎస్ ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో చీఫ్ జనరల్ మేనేజర్, సూపరింటెండెంట్ ఇంజనీర్లతో ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్తు వినియోగించే సమయంలో ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని రఘుమారెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పలు సూచనలు చేశారు.

సూచనలు.. ఇవే..

* వర్షాకాలంలో విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండటం మంచిది. స్టే వైరు, ట్రాన్స్‌ఫార్మర్‌, విద్యుత్‌ లైన్ల కింద నిలబడవద్దని… వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

* పెంపుడు జంతువులు మరియు పశువులను కూడా విద్యుత్ పరికరాలకు దూరంగా ఉంచాలి. వర్షాలు, తుపానుల కారణంగా రోడ్లపై విద్యుత్ తీగలు తెగిపోయినా, నీటిలో వైర్లు కనిపించినా వాటిని తొక్కవద్దని, కాళ్లు పెట్టవద్దని, వాహనాలను నడపవద్దని చెప్పారు.

* వైర్లు తెగిపోవడం గమనించినట్లయితే వెంటనే సమీపంలోని విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలి… లేకుంటే హెల్ప్ లైన్ల ద్వారా తెలియజేయాలి.

* భవనాలు, వాహనాలు, చెట్ల కొమ్మలపై విద్యుత్ తీగలు తెగితే వెంటనే సమాచారం అందించాలి.

* భారీ వర్షాల సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. అలాంటి సమయంలో ఇంట్లోని విద్యుత్ పరికరాలను వీలైనంత వరకు ఆఫ్ చేయాలని… వెంటనే కంట్రోల్ రూంకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

* వినియోగదారులు కంట్రోల్ రూమ్‌కి అటువంటి ఫిర్యాదులను ఇచ్చే ముందు USC నంబర్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి. తమ ఇంటి కరెంటు బిల్లుపై ఈ నంబర్ ఉంటుందని తెలిపారు.

* అపార్ట్‌మెంట్ సెల్లార్లు, లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరితే వెంటనే విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలి.

* విద్యుత్‌కు సంబంధించిన ఏదైనా అత్యవసర పరిస్థితిని కంపెనీ మొబైల్ యాప్ వెబ్‌సైట్ మరియు సోషల్ మీడియా ద్వారా విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకురావచ్చు.

* అత్యవసర పరిస్థితుల్లో 1912, 100 లోకల్ ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్‌లు 73820 72104, 73820 72106, 73820 71574కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

Sitting Position: పిల్లలు కూర్చునే పొజిషన్‌.. వారిపై ఆధారపడే ఆరోగ్యం