Leading News Portal in Telugu

నటుడు రజినీకాంత్ కు గవర్నర్ పదవి.. బీజేపీ వ్యూహం అదేనా? | governer post to rajanikanth| bjp| straregy| strengthen| tamilnadu| yogi| pannir


posted on Sep 5, 2023 11:03AM

నటుడు రజనీకాంత్ ను ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా నియమించనున్నారన్న వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వార్తలపై రజనీకాంత్ ఇప్పటి వరకూ స్పందించకపోయినప్పటికీ ఆయన సోదరుడు సత్యనారాయణ మాత్రం అ వార్తలు నిజమైతే చాలా సంతోషిస్తామని అన్నారు. తన సోదరుడు రజనీకాంత్ తనంత తానుగా పదవుల కోసం పాకులాడరని చెప్పిన ఆయన పదవి వస్తే మాత్రం ఆయన తిరస్కరించరని చెప్పారు. అంతా దేవుడి చేతుల్లో ఉందన్నారు.

కాగా రజనీకాంత్ సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేసుకుని ఆ తరువాత ఆరోగ్య కారణాలు చూపుతూ ఆవిర్భావానికి ముందే తన పార్టీని మూసేశారు. పార్టీ ఏర్పాటు కోసం తన అభిమానులతో విస్తృత స్థాయి సమావేశాలు కూడా నిర్వహించి ఆ తరువాత రాజకీయాలు తనకు సరిపడవని మిన్నకున్నారు. ఆయన పార్టీ యోచన చేసినప్పుడూ, ఆ తరువాత కూడా బీజేపీకి ఒకింత సానుకూలతనే వ్యక్తం చేశారు. దీంతోనే రజనీకాంత్ కు గవర్నర్ పదవిని కట్టబెట్టడం ద్వారా బీజేపీ తమిళనాడులో బలోపేతం కావాలన్న యోచనలో ఉందని పరిశీలకులు అంటున్నారు.

దీనికి తోడు రజనీకాంత్ ఇటీవలి కాలంలో  యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంలతో రజనీ భేటీ కావడంతో రజనీకాంత్ కు గువర్నర్ గిరీ వార్తలకు బలం చేకూరుతున్నది.

మొత్తం మీద తమిళనాడులో పాగా వేయాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ ఆ ప్రయత్నంలో భాగంగా విశేష అభిమాన బలం ఉన్న రజనీకాంత్ కు గవర్నర్ పదవిని ఆఫర్ చేసిందనీ, ఆయనను ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా నియమిస్తే..తమిళనాడులో ఆయన అభిమానులు బీజేపీకి మద్దతుగా నిలిచే అవకాశాలు మెండుగా ఉంటాయన్నది బీజేపీ ఉద్దేశంగా చెబుతున్నారు.