ఏపీలో రాజకీయం మంచి రంజూ మీద ఉంది. ఛాన్స్ దొరికినప్పుడల్లా.. అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే, తాజాగా చంద్రబాబు నాయుడికి ఐటీ నోటీసులు ఇచ్చారనే వార్తలపై వైసీపీ పార్టీ నేతలు ఆయనను టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. బాబు-కొడుకుల అరెస్ట్ ఎలా జరుగుతుందనే చర్చ ప్రస్తుతం జరుగుతోందన్నారు. తండ్రి బ్రోకర్.. కొడుకు జోకర్.. చంద్రబాబు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని ఐటీ శాఖ తేల్చేసింది అని మంత్రి కొట్టు పేర్కొన్నారు.
అమరావతిని చంద్రబాబు తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కేంద్రంగా చేసుకున్నాడు అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఐటీ నోటీసుల ద్వారా బయట పడింది అవగింజంత.. చంద్రబాబు హయాంలో వేల కోట్లు నామినేషన్ పద్దతిన ఇచ్చేశాడు.. చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం.. సింగపూర్ మంత్రి ఈశ్వరనుతో ఉన్న లింకులన్నీ బయటపడ్డాయని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు.. నారా లోకేష్ ను ఆంబోతులా రోడ్ మీదకు వదిలేశారు.. లోకేష్ పాదయాత్ర తర్వాత టీడీపీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతోందన్నాడు. డబ్బులు నొక్కేసే విషయంలో మాత్రం బాబు – కొడుకులు పోటీ పడుతున్నారు అని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.
ఇండియా పేరు మార్పుపై మంత్రి కొట్టు సత్యనారాణ సంచలన కామెంట్స్ చేశారు. ప్రతిపక్షాలు ఇండియా అని పేరు పెట్టుకున్నారని భారత్ అనే పేరు పెడుతున్నారని ఊహాగానాలు వస్తున్నాయి.. ఏవో ఊహాగానాలు వస్తున్నాయి.. మేమేం చెబుతాం.. భారత్ అని పేరు మార్చినంత మాత్రాన బయట వాళ్లు ఇండియా అని పిలకుండా ఉంటారా..? అని ఆయన ప్రశ్నించారు. మేం ఇండియాలోనూ లేం.. ఎన్డీఏలో లేమని మంత్రి కొట్టు సత్యనారాయణ తేల్చి చెప్పారు.
దుర్గ గుడిలో, శ్రీశైలంలో సుమారు రూ. 400 కోట్ల అంచనాలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. విజయవాడ కనక దుర్గమ్మ ఆలయం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం.. రూపొందించిన ప్లాన్ ప్రకారం టెండర్ల ప్రక్రియను ప్రారంభించాం.. ప్రసాదం పోటు, అన్న దానం బిల్డింగ్, శివాలయం, రాక్ మిటిగేషన్, స్కాడా వంటి పనులు చేపడుతున్నామన్నారు. ప్రస్తుతం దుర్గమ్మ ఆలయం ఉన్న ఘాట్ రోడ్డు వాస్తు ప్రకారం ఉండకూడదని అంటున్నారు.. నైరుతి వైపు నుంచి రాకపోకలు సరి కాదనేది వాస్తు నిపుణులు తెలిపారని ఆయన వెల్లడించారు.