Article 370: జమ్మూ కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడం, జమ్మూకాశ్మీర్ ని రెండుగా విభజించడంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. తాజాగా ఈ కేసులో సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయ్ , సూర్యకాంత్‌లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 16 రోజుల పాటు వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది.
సుప్రీంలో జరిగిన వాదనలపై తాము సంతృప్తితో ఉన్నామని పిటిషన్ దాఖలు చేసిన నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు హస్నై్ మసూది అన్నారు. ఆగస్ట్ 2న విచారణ ప్రారంభమై 16 రోజుల పాటు ఈ కేసుపై ఇరుపక్షాలు తమ వాదనలను వినిపించాయి. పిటిషనర్ల తరుపున మొదటి 9 రోజులు లాయర్లు సుప్రీంకు తమ వాదనల్ని వినిపించారు. జమ్మూ కాశ్మీర్ స్వభావాన్ని చర్చించారు. జమ్మూ కాశ్మీర్ రాజు రాజా హరిసింగ్ కాశ్మీర్ అంతర్గత సార్వభౌమాధికారాన్ని భారతదేశానికి ఎలా వదులుకోలేదనే విషయాన్ని న్యాయవాదులు నొక్కి చెప్పారు. పిటిషనర్ల తరుపున కపిల్ సిబల్, జఫర్ షా, గోపాల్ సుబ్రమణ్యం, రాజీవ్ థావన్, దుష్యంత్ దవే, దినేష్ ద్వివేది సహా సీనియర్ న్యాయవాదులు తమ వాదల్ని వినిపించారు.
భారత ప్రభుత్వం తరుపున అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్ వెంటరమణి, సోలిసిటర్ జనరల్ తుషార్ మోహతా, అదనపు సోలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ వాదనల్ని వినిపించారు. ఆర్టికల్ 370 రద్దు జమ్మూ కాశ్మీర్ ప్రజల ‘మానసిక ద్వంద్వత్వాన్ని’ పరిష్కరించిందని. అంతకుముందు అక్కడి ప్రజలపై వివక్ష ఉండేదని భారత ప్రభుత్వం తెలిపింది. భారత రాజ్యాంగ నిర్మాతలు కూడా ఆర్టికల్ 370ని తాత్కాలిక నిబంధనగా పరిగణించారని సుప్రీంకి విన్నవించారు.