Anil Kumar Yadav: ఐటీ నోటీసులపై చంద్రబాబు, లోకేష్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు మాజీ మంత్రి, నెల్లూరు ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్… చంద్రబాబుకు ఐటీ నాలుగో నోటీసు ఇచ్చిందన్న ఆయన.. ఒక ఏడాది అసెస్‌మెంట్ కు సంబంధించి రూ.118 కోట్ల ముడుపులకు సంబంధించిన వ్యవహారం ఇది. మనోజ్ వాసుదేవ్ ను తనిఖీలు చేస్తుంటే తీగ లాగితే డొంక కదిలినట్లు చంద్రబాబు వ్యవహారాలు బయటకు వచ్చాయి.. షాపూర్జీ పల్లోంజీలో మనోజ్ వాసుదేవ్ కీలక వ్యక్తి అన్నారు. ఇక, 2020లోనే రెండు వేల కోట్ల రూపాయల ఆస్తి సమకూర్చుకున్నాడని చంద్రబాబు పీఏ శ్రీనివాస్ పై ఆరోపణలు ఉన్నాయన్న ఆయన.. చంద్రబాబు ఐదేళ్ళ పాలనలో అన్ని వ్యవహారాలు బయటకు తీస్తే వేల కోట్ల రూపాయల దోపిడీ విషయాలు బయటకు వస్తాయన్నారు. చంద్రబాబు కప్పను మింగిన పాములాగా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టిన ఆయన.. ముఖ్యమంత్రి జగన్, ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం అయితే.. చంద్రబాబు మీడియా ప్యాంట్లు తడుస్తున్నాయా? ఎందుకు ఈ వార్తల రాయటం లేదు? అని ప్రశ్నించారు.
ఇక, చంద్రబాబు వ్యవహారంలో దత్తపుత్రుడు (పవన్ కల్యాణ్) కనీసం ట్వీట్ ద్వారా అయినా ఎందుకు స్పందించ లేకపోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు అనిల్ కుమార్ యాదవ్.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఎందుకు నోరు మెదపడంలేదని ప్రశ్నించిన ఆయన.. బంధు ప్రీతినా? మరిది ప్రీతినా? అని నిలదీశారు. ఊర్లు పట్టుకుని తిరుగుతున్న పులకేశి కూడా స్పందించటం లేదు.. తండ్రి, కొడుకులు ఇద్దరి పేర్లు ఈ 45 పేజీల నోటీసులో ఉన్నాయి. చంద్రబాబు ఢిల్లీకి పరుగులు పెడుతుండటం వెనుక ఈ కేసుల మతలబు ఉందని స్పష్టం అయ్యిందన్నారు. ఈ ముడుపుల్లో పవన్ కల్యాణ్‌కు కూడా వాటా ఉందా? వామపక్ష నేతలు నారాయణ, రామకృష్ణ ఎందుకు మాట్లాడటం లేదో అర్థం కావటం లేదు అని అనుమానాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది.. చంద్రబాబు ఒంటి నిండా అవినీతి మచ్చలే.. ఇవి మా ఆరోపణలు కాదన్నారు. ఐటీ ఇచ్చిన నోటీసులను చంద్రబాబు, లోకేష్ వివరణ ఏంటని అడుగుతున్నాం అన్నారు.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్ ను రెండో సారి ముఖ్యమంత్రిని చేయటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. టీడీపీ, జనసేన పార్టీలను సమాధి చేయటానికి సిద్ధం అవుతున్నారని వెల్లడించారు మాజీ మంత్రి, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.