Leading News Portal in Telugu

World Cup 2023: అమితాబ్‌ బచ్చన్‌కు ‘గోల్డెన్‌ టికెట్‌’.. అన్ని మ్యాచ్‌లు ఫ్రీ!


BCCI presents Golden ticket to Amitabh Bachchan for World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్ గడ్డపై జరగనుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టుని చీఫ్ సెలక్టర్‌ అజిత్ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. భారత జట్టుకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కాగా.. హార్దిక్‌ పాండ్యా వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. బీసీసీఐ జట్టును ప్రకటించడంతో పాటు ‘గోల్డెన్‌ టికెట్‌’ను అందజేసింది.

భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌ 2023కి సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన ‘గోల్డెన్‌ టికెట్‌’ను బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్‌ బచ్చన్‌కు బీసీసీఐ కార్యదర్శి జై షా అందజేశారు. ఈ టికెట్‌ ద్వారా ప్రత్యేక అతిథి హోదాలో భారత్‌లో జరిగే అన్ని వేదికల్లో అన్ని మ్యాచ్‌లనూ చూసే అవకాశం ఉంది. మహానటుడే కాకుండా క్రికెట్‌ వీరాభిమాని అయిన అమితాబ్‌కు ‘గోల్డెన్‌ టికెట్‌’ ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు జై షా తెలిపారు. ఎప్పటిలాగే భారత్‌కు అమితాబ్‌ మద్దతు కొనసాగాలని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

12 ఏళ్ల తరువాత ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తుంది. 2011లో భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ను ఎంఎస్ ధోనీ సారథ్యంలోని జట్టు గెలిచిన విషయం తెలిసిందే. మరోసారి భారత గడ్డపై మెగా టోర్నీ జరుగుతుండడంతో టీమిండియా కప్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టోర్నీ మొదటిమ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్‌ తలపడనున్నాయి.