Leading News Portal in Telugu

Australia Squad: ప్రపంచకప్‌ 2023కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. ఆ ముగ్గురు ప్లేయర్స్ ఔట్!


Australia Squad for ICC ODI World Cup 2203: భారత గడ్డపై జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023 టోర్నీ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తమ జట్టును ప్రకటించింది. ఇదివరకు ప్రకటించిన ప్రిలిమినరీ జట్టులో ముగ్గురు ఆటగాళ్లను తొలగించి.. 15 మంది సభ్యుల పేర్లను ఫైనల్‌ చేసింది. ఆస్ట్రేలియా జట్టులో తొలిసారిగా చోటు దక్కించుకున్న యువ ఆల్‌రౌండర్‌ ఆర్డోన్‌ హార్డీ, తన్వీర్‌ సంఘా సహా పేసర్‌ నాథన్‌ ఎల్లిస్‌కు సీఏ మొండిచేయి చూపింది.

ఆర్డోన్‌ హార్డీ, తన్వీర్‌ సంఘా, నాథన్‌ ఎల్లిస్‌ తప్ప ప్రిలిమినరీ జట్టులో చోటు దక్కించుకున్న వాళ్లంతా ఆస్ట్రేలియా ఫైనల్‌ టీమ్‌లో స్థానం సంపాదించారు. పేసర్‌ సీన్‌ అబాట్‌ తన స్థానాన్ని నిలబెట్టుకోగా.. టెస్టు స్పెషలిస్టు మార్నస్‌ లబుషేన్‌ పేరును సీఏ ఈసారి కూడా పరిగణనలోకి తీసుకోలేదు. అయితే కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ సహా కీలక ప్లేయర్స్ ఫిట్‌నెస్‌ లేమితో సతమతం అవుతుండడం ఆస్ట్రేలియాను కంగారుపెడుతోంది. సెప్టెంబరు 28 వరకు ప్రపంచకప్‌ జట్టులో మార్పులు చేసుకునేందుకు అవకాశం ఉంది. దాంతో ఫిట్‌నెస్‌లేని ఆటగాళ్ల స్థానంలో వేరే వాళ్లు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

ప్రపంచకప్‌ 2023కి ముందు దక్షిణాఫ్రికా, భారత్‌తో ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లు ఆడనుంది. ఈ రెండు వన్డే సిరీస్‌లలో ఆసీస్ ఇదే జట్టుతో బరిలోకి దిగనుంది. మెగా టోర్నీకి ముందు ఈ రెండు సిరీస్‌లు (ఎనిమిది వన్డేలు) ఆస్ట్రేలియా మంచి సన్నాహకంగా ఉపయోగించుకోనుంది. ఇక భారత్‌ వేదికగా అక్టోబరు 5 నుంచి మెగా ఈవెంట్‌ మొదలుకానుండగా.. అక్టోబరు 8న టీమిండియాతో ఆసీస్‌ తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. వన్డే వరల్డ్‌కప్‌ ట్రోఫీని ఆస్ట్రేలియా అత్యధికంగా 5 సార్లు గెలిచిన విషయం తెలిసిందే.

ఆస్ట్రేలియా జట్టు:
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, ఆష్టన్‌ అగర్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్‌, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, మార్కస్ స్టొయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్.