Leading News Portal in Telugu

Top Headlies@5PM : టాప్ న్యూస్


కెరీర్ హై రేటింగ్‌కు చేరుకున్న భారత యువ ఆటగాళ్లు!

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత యువ ఆటగాళ్లు శుభ్‌మాన్ గిల్, ఇషాన్ కిషన్ కెరీర్ హై రేటింగ్‌కు చేరుకున్నారు. ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో గిల్ మూడో స్థానంలో ఉన్నాడు. భారత ఓపెనర్ ఖాతాలో 750 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఆసియా కప్‌ 2023లో నేపాల్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గిల్ అజేయంగా 67 పరుగులు చేసిన విషయం తెగెలిసిందే. వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్‌కు అత్యధిక రేటింగ్ పాయింట్స్ ఇవే కావడం విశేషం.

పల్లెకెలెలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్ (82) ఆడాడు. దాంతో 624 రేటింగ్ పాయింట్లతో కెరీర్-బెస్ట్ మార్క్‌ అందుకున్నాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌ జాబితాలో 12 స్థానాలు ఎగబాకిన ఇషాన్.. 24వ స్థానానికి చేరుకున్నాడు. ఇక బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ (882) నం.1 ర్యాంక్ నిలబెట్టుకున్నాడు. రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (777) రెండో స్థానంలో ఉండగా.. శుభ్‌మాన్ గిల్ మూడో స్థానంలో ఉన్నాడు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రద్దు చేయండి.. ఎన్నికలు జరపండి

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రద్దు చేసి.. జమిలి ఎన్నికలు జరపాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో కొనసాగుతున్న ప్రభుత్వాలను రద్దుచేయాలని కోరారు. 2024 ఏప్రిల్-మే నెలలో జరిగే సాధారణ ఎన్నికలతో పాటు ఆ రాష్ట్రాలకు కూడా ఎన్నికల జరపాలని అన్నారు.మరో తొమ్మిది నెలలలో ఎన్నికలు జరుగుతుండగా.. అకస్మాత్తుగా జమిలి ఎన్నికల గురించి హడావిడి చేయడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. మన ప్రజాస్వామ్య ప్రక్రియలలో సంస్కరణల పట్ల నిజాయితీతో మీరు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారా? అని ప్రధాని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మీ ప్రభుత్వ వైఫల్యాలనుండి ప్రజల దృష్టిని మరల్చడం కోసం మరో డ్రామా ఆడే ప్రయత్నాలు చేస్తున్నారా? ఇటువంటి సందేహాలు దేశ ప్రజలందరికీ కలుగుతున్నాయని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం భారత్ అలాంటి దేశాన్ని ఒకే దేశం ఒకే పన్ను – ఒకే దేశం ఒకే రేషన్.. ఇప్పుడు ప్రస్తుతం ఒకే దేశం ఒకే ఎన్నిక అంటూ మీ నిరంకుశ వ్యవస్థలో మాదిరిగా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు.

అభయ హస్తం డబ్బులు వారం రోజుల్లో జమ చేస్తాం

అభయహస్తం డబ్బులు వారం రోజుల్లో ఖాతాలో జమ చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా సంగెం మండలంలోనీ గుంటూరుపల్లి గ్రామంలో ఎర్రబెల్లి పర్యటించారు. సంగెం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. సంగెం మండలంలోనీ గుంటూరుపల్లి గ్రామంలో రూ.3 కోట్ల 10 లక్షలు,కాపులకనపర్తి గ్రామంలోరూ.8 కోట్ల 18 లక్షలు ,గవిచర్ల గ్రామంలో రూ.14 కోట్ల 19 లక్షలతో మహిళా భవనాలు,సిసి రోడ్లు, బి.టి.రోడ్లు ,కమ్యూనిటీ భవనాలు,గ్రామ పంచాయతీ భవనం,మహిళా సంఘాల భవనాలు ,సబ్ స్టేషన్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవం, పలు అభవృద్ధి పనుల శంకుస్థాపన చేశారు. రైతులకు పంటనష్టపరిహారం చెక్కులు పంపిణీ చేశారు. సంగేం మండలం అభివృద్ధికి అత్యధిక నిధులను కేటాయించామన్నారు. పటిష్టమైన విజన్ తో ముఖ్య మంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని అన్నారు.

ప్రేమికులని భావించి అన్నాచెల్లెలుపై దాడి.. రక్షాబంధన్ రోజు ఘటన

మధ్యప్రదేశ్ ఛతర్‌పూర్ లో దారుణం జరిగింది. రక్షాబంధన్ పండగ రోజునే అన్నాచెల్లెలుపై దాడి జరిగింది. ప్రేమికులని భావించి ముగ్గురు వ్యక్తులు వీరిని చితకబాదారు. ఈ ఘటనపై బాధితులు ఫిర్యాదు చేయడంతో నిందితులపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆగస్ట్ 31న జరిగిన ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కొంతమంది నిందితుడు హిందూసంస్థ భజరంగ్ దళ్ కి చెందిన వ్యక్తిగా ఆరోపించారు. అయితే పోలీసులు మాత్రం దీనికి ఖచ్చితమైన ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఈ ఆరోపనల్ని జిల్లా ఎస్పీ రత్నేష్ తోమర్ ఖండించారు. అతుల్ చౌదరి అనే వ్యక్తి తన సోదరితో కలిసి ఫిర్యాదులో భజరంగ్ దళ్ ప్రమేయం లేదని పేర్కొన్నారు. బాధితులు అతుల్ చౌదరి, అతని సోదరి సతాయ్ రోడ్డులో ఉన్న దేవాలయం సమీపంలో చాట్ దుకాణం వద్ద నిలబడి ఉన్నారు. లవర్స్ గా భావించి ముగ్గురు అక్కడే వీరిపై దాడి చేశారు. ఈ దాడికి ఏ రాజకీయ పార్టీకి కానీ ఏ సంస్థకి కానీ సంబంధం లేదని పోలీసులు తెలిపారు. ఘటనపై తదుపరి విచారణ సాగుతోంది.

మరోసారి మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ.. గో బ్యాక్ అంటూ నినాదాలు..

మరోసారి మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ ఎదురైంది. గో బ్యాక్ మల్లారెడ్డి, గో బ్యాక్ అంటూ గ్రామస్థులు పెద్ద ఎత్తున నినాదలు చేశారు. శామీర్ పేట మండలం బొమ్మరాసి పేట గ్రామపంచాయతీ పరిధిలో గ్రామస్తులకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గ్రామానికి విచ్చేసిన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామంలో 380 మంది అర్హులైన వారందరికీ ఒకేసారి పట్టాలు ఇవ్వాలని కోరారు. ఇప్పుడు కొంతమందికి తర్వాత కొంతమందికి పట్టులు ఇస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదని మల్లారెడ్డిని గ్రామస్తులు నిలదీశారు. మంత్రి మల్లారెడ్డి అర్హులైన వారికి కాకుండా కొంతమందికే పట్టాలు ఇస్తానని మాట్లాడడంతో.. గో బ్యాక్ మంత్రి మల్లారెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంట్రీ ఇచ్చారు. 2009వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో బొమ్మరాసిపెట గ్రామస్తులకు 200 మందికి పట్టాలు ఇచ్చామని అన్నారు. అవే పట్టాలను మంత్రి మల్లారెడ్డి అర్హులైన పేదలకు కాకుండా వేరే వాళ్లకు పట్టాలను పంపిణీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వైబ్రంట్ లీడర్..

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో బుధవారం పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ జరిగింది. అయితే.. లంచ్‌కోసమే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసానికి వచ్చామని మాణిక్‌రావు ఠాక్రే తెలిపారు. పార్టీ ఇంటర్నల్ అంశాల మీద సూచనలు, అభిప్రాయాలు చేశారన్నారు. ఆయన నారాజ్ గా లేరని, భేటీలో ప్రత్యేకత ఏమి లేదన్నారు. కోమటి రెడ్డి చాలా పెద్ద లీడర్ అని మాణిక్‌రావు ఠాక్రే వ్యాఖ్యానించారు. అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కోమటి రెడ్డి సీనియర్ పార్లమెంట్ నాయకులు, మా పార్టీ స్టార్ క్యాంపెయినర్‌ అని ఆయన అన్నారు. భోజనాలకు పిలిచారు వచ్చామని, పార్టీ కి సంబంధించిన ప్రణాళిక ల మీద సూచనలు, అభిప్రాయాలు చెప్పారన్నారు. అందరూ ఇక్కడ అందుబాటులో ఉన్నారు కాబట్టి సమావేశం అయ్యమని, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వైబ్రంట్ లీడర్ అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

అన్ని ధర్మాలను సంరక్షించాలి..అంతేకాని అవమానించకూడదు

ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. అన్ని ధర్మాలను సంరక్షించాలి..అంతేకాని అవమానించకూడదని ఆయన హితవు పలికారు. ఉదయనిధి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలు చేసి ఐదు రోజులు దాటిందన్నారు. ఉదయనిధి పార్టీ కాంగ్రెస్ కూటమిలోనే ఉంది కదా? రాహుల్ గాంధీ కూడా సైలెంట్ గా ఉన్నారని, ఆ కూటమిలో ఒకరు.. దేశాన్ని అవమానించేలా వ్యాఖ్యానించారని అన్నారు.

ఉదయనిధి “సనాతన” వ్యాఖ్యలపై స్పందించిన ప్రధాని మోడీ..

తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదం అయ్యాయి. ముఖ్యంగా బీజేపీ డీఎంకే పార్టీని, ఇండియా కూటమిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ఇండియా కూటమి హిందూమతాన్ని ద్వేషిస్తోందని, ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. మరోవైపు కాంగ్రెస్ తాము అన్ని మతాలను సమానం చూస్తామని ప్రకటించింది.

ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్‌.. మూడు రోజుల పాటు వర్షాలు

ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వద్ధ గల అల్పపీడనం ఈ రోజు బలహీనపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం దక్షిణ అంతర్గత ఒడిస్సా, సరిహద్దు ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి.. నైరుతి వైపు వంగి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు వాయవ్య బంగాళాఖాతం నుంచి తెలంగాణ వరకూ ఒక ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

కొండా మురళీపై ఎమ్మెల్యే చల్లా పరోక్ష విమర్శలు

వరంగల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు కొండా మురళీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. చేతకానోళ్లే తొడలు కొడతారని.. మీసాలు తిప్పుతారని అన్నారు. ఇలా సవాలు చేసిన వాళ్లు వెళ్లిపోయాక పరకాలలో గొడవలు, ఘర్షణలు లేని వాతావరణం ఉందన్నారు. మళ్లీ అలాంటి పరిస్థితి తేవొద్దని ఆయన సూచించారు.. సంగెం మండలంలో పలు అభవృద్ధి పనులకు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో కలిసి స్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఎమ్మెల్యే చల్లా. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ కామెంట్ చేయడం హాట్‌ టాపిక్ గా మారింది.

శ్రీలంక వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. ఇక మ్యాచ్లకు ఇబ్బందేమీ లేదు

శ్రీలంక వేదికగా ఆసియా కప్ మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే అక్కడ మ్యాచ్ లకు ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. మ్యాచ్ మొదటి రోజు నుంచే వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు మ్యాచ్ లకు వర్షం అడ్డంకిగా మారిది. ఇండియా మొదటి మ్యాచ్ పాకిస్తాన్ తో తలపడినప్పుడు వర్షం కారణంగా ఆగిపోయింది. దీంతో మ్యాచ్ రద్దు కాగా.. ఇరు జట్లకు చెరో ఒక పాయింట్ ఇచ్చారు.

ఇప్పటికే శ్రీలంకలో వర్షాలు భారీగా పడుతున్నాయి.. ఈ నేపథ్యంలో శ్రీలంక వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు వర్షం కారణంగా కొన్ని మ్యాచ్ లు రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటినుంచి జరగబోయే మ్యాచ్ లకు వర్ష ప్రభావం ఏమీ ఉండదని ఓ సీనియర్ అధికారి చెప్పారు. సెప్టెంబర్ 9 తర్వాత వాతావరణం అనుకూలంగా ఉంటుందన్నారు. సెప్టెంబర్ 10న కొలంబో వేదికగా జరిగే సూపర్ ఫోర్ మ్యాచ్‌లో భారత్ పాకిస్థాన్‌తో తలపడనుంది. సెప్టెంబర్ 12న అదే వేదికపై శ్రీలంకతో, ఆ తర్వాత సెప్టెంబర్ 15న బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఫైనల్ సెప్టెంబర్ 17న జరగనుంది.