విశాఖ సీపీ బదలీ వెనుక ఎంపీ హస్తం? ! | vizag mp trivikram transfer| mp| mvv| hand| family| kidnap| party| pride| diminish| rebel| parliament
posted on Sep 6, 2023 5:45PM
ఆంధ్రప్రదేశ్‌లో 11 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. జగన్ ప్రభుత్వం మంగళవారం (సెప్టెంబర్ 5) ఆదేశాలు జారీ చేసింది. ఆ బదిలీ అయిన ఐపీఎస్ అధికారుల జాబితాలో విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ వర్మ పేరు కూడా ఉంది. ఆయన బదలీపై ఉత్తరాంధ్ర రాజకీయ వర్గాల్లో వాడి వేడిగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే విశాఖ నగర పోలీస్ కమిషనర్‌గా త్రివిక్రమ్ వర్మ చార్జ్ తీసుకుని జస్ట్ 5 నెలలు కూడా గడవక ముందే ఆయనపై బదిలీ వేటు పడడం వెనుక ఎంపీ ఎంవీవీ హస్తం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఏడాది అంటే 2023 ఏప్రిల్ 12వ తేదీన త్రివిక్రమ వర్మ విశాఖ నగర పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు.
ఆ కొద్ది రోజులకే అంటే జూన్ రెండో వారంలో విశాఖపట్నం ఎంపీ, వైసీపీ నాయకుడు ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీ కిడ్నాప్ కావడం.. ఆ తర్వాత ఈ కిడ్నాప్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కాగా.. ఈ విషయం ఢిల్లీలోని కేంద్ర పెద్దల వరకు వెళ్లడం.. ఆ క్రమంలో అధికార పార్టీ ప్యామిలీ కిడ్నాప్ వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. చివరకు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మీడియా ముందుకు వచ్చి.. ఆంధ్రప్రదేశ్‌లో తాను వ్యాపారాలు చేయలేనని.. తన బిచాణా మొత్తం పక్కనే ఉన్న తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు ఎత్తేస్తానంటూ ప్రకటించడంతో.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని స్వయంగా అధికార పార్టీకి చెందిన ఓ ప్రజా ప్రతినిదే బయట ప్రపంచానికి తెలిపినట్లు అయింది.
అయితే ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ జరిగినా.. ఆ వ్యవహారాన్ని బయటకు రాకుండా ఆదిలోనే కంట్రోల్ చేయడంలో.. విశాఖ నగర పోలీస్ కమిషనర్‌గా త్రివిక్రమ వర్మ పూర్తిగా విపలమయ్యారని, అందువల్ల ఈ కిడ్నాప్ వ్యవహారం కారణంగా జగన్ ప్రభుత్వ పరువు కొండెక్కిందని, విశాఖ సీపీ త్రివిక్రమ్ వర్మ కారణంగానే ఇదంతా జరిగిందంటూ.. పార్టీలోని పెద్ద తలకాయిలు అప్పుడు పెదవి విరిచాయనే ఓ చర్చ సైతం అధికార వైసీపీలో నేటికి కొన సాగుతోంది.
అంతేకాదు.. విశాఖ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారంపై అధికార వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కేంద్రంలోని పెద్దలకు లేఖలు రాయడం.. దీనిపై లోక్‌సభలోనే రఘురామకృష్ణం రాజుపై ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సీరియస్ కావడం.. దీంతో సభలోని సభ్యులంతా.. ఏం జరిగిందంటూ వీరిద్దరి వ్యవహారంపై ఆరా తీయడంతో.. ఢిల్లీ వేదికగా పార్టీ పరువు గంగలో కలిసింది. ఈ నేపథ్యంలోనే అదును చూసి ఎంపీ చక్రం తిప్పి కమిషనర్ త్రివిక్రమ్ పై బదలీ వేటుకు కారణమయ్యారని అంటున్నారు.
అదీ ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనకు వెళ్లిన మూడు రోజులకే.. ఇలా 11 మంది ఐపీఎస్‌లను బదిలీ చేయడం పట్ల పోలిటికల్ సర్కిల్‌లో విస్మయం వ్యక్తమవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఐపీఎస్‌ల బదిలీలు ఉంటాయి కానీ.. ముఖ్మమంత్రి రాష్ట్రంలో లేని సమయంలో.. ఎవరి ఆదేశాలతో ఈ బదిలీలు జరిగాయన్న చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో జోరందుకుంది.