ఢిల్లీలో వన్ నేషన్ – వన్ ఎలక్షన్ గురించి చర్చించేందుకు హోంమంత్రి అమిత్ షా, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. గత శనివారం (సెప్టెంబర్ 2) కోవింద్ అధ్యక్షతన ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఏ అజెండాతో ముందుకెళ్లాలనే దానిపై న్యాయశాఖ కార్యదర్శి నితిన్ చంద్ర, శాసన వ్యవహారాల కార్యదర్శి రీటా వశిష్ఠ తదితరులు చర్చించినట్లు సమాచారం.
ఈ కమిటీలో హోంమంత్రి అమిత్ షాతో పాటు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, మాజీ లోక్‌సభ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, ఎన్కే సింగ్, మాజీ సీవీసీ సంజయ్ కొఠారి, కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్ సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ కమిటీలో ఉండేందుకు గులాం నబీ ఆజాద్, అధీర్ రంజన్ చౌదరి నిరాకరించారు.
లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలించి, వీలైనంత త్వరగా సిఫార్సులు చేసేందుకు ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రాజ్యాంగం.. ప్రజాప్రాతినిధ్య చట్టం, ఏదైనా ఇతర చట్టం నియమాలను పరిశీలిస్తుంది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం కోసం నిర్దిష్ట సవరణలను కూడా సిఫారసు చేస్తుంది. రాజ్యాంగ సవరణకు రాష్ట్రాల మద్దతు అవసరమా అనే అంశాన్ని కూడా కమిటీ పరిశీలించి సిఫారసు చేస్తుంది. మరోవైపు వన్ నేషన్- వన్ ఎలక్షన్ ను సమర్ధిస్తూనే.., దీనివల్ల సమయం, డబ్బు ఆదా అవుతుందని ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇది రాష్ట్రాల సమాఖ్యపై దాడి చేయడమేనని మండిపడుతున్నాయి.