Leading News Portal in Telugu

Pakistan-Afghanistan Clash: తాలిబాన్‌, పాక్ సైన్యాల మధ్య ఘర్షణ.. సరిహద్దులో కాల్పులు


Pakistan-Afghanistan Clash: పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ప్రధాన సరిహద్దులో బుధవారం కాల్పులు జరిగాయని, ఆ తర్వాత ఆఫ్ఘన్-పాకిస్తాన్ సరిహద్దును మూసివేసినట్లు పాకిస్తాన్ భద్రతా వర్గాలు తెలిపాయి. స్థానిక నివాసితుల ప్రకారం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లను కలిపే టోర్ఖమ్ సరిహద్దులో కాల్పుల శబ్దాలు వినిపించాయి. కాల్పుల శబ్ధాలు వినడంతో అక్కడున్న ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని చెప్పారు. ఈ ఘటన తర్వాత టోర్ఖమ్ సరిహద్దును మూసివేశారు. తాలిబన్లు, పాకిస్థాన్ భద్రతా బలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయని భద్రతా అధికారి ఒకరు వార్తా సంస్థ రాయిటర్స్‌తో చెప్పారు. అయితే ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.

అదే సమయంలో, ఆఫ్ఘనిస్తాన్‌లోని తూర్పు నంగహార్ ప్రావిన్స్‌లోని ప్రభుత్వ ప్రతినిధి, పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి ఈ కాల్పులపై ఇంకా ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు వివాదం చాలా కాలంగా కొనసాగుతోందని సంగతి తెలిసిందే. ఇరు దేశాల పౌరులు టోర్ఖమ్ సరిహద్దు గుండా మాత్రమే వచ్చి వెళతారు. అయినప్పటికీ, రెండు దేశాల మధ్య అనేక వివాదాల కారణంగా, ఈ సరిహద్దును మూసివేయవలసి వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా టోర్ఖమ్ సరిహద్దును మూసివేశారు. దీంతో సరిహద్దుకు ఇరువైపులా వేలాది ట్రక్కులు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఇరువర్గాల నుంచి కాల్పులు జరిగిన విషయంపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.