Sundar Pichai: గూగుల్.. ప్రస్తుతం ప్రతీ ఒక్కరికి కనీస అవసరంలాగా మారిపోయింది. సెర్చ్ ఇంజన్ అనగానే గుర్తొచ్చే మొదటి పేరు గూగుల్. అంతలా ఎదిగిపోయింది మరీ ఆ సంస్థ. ఏ విషయం అడిగినా ప్రతి ఒక్కరు గూగుల్ సెర్చ్ చేయడం సాధారణమైపోయింది. అంతటి దిగ్గజ సంస్థ పుట్టి నేటికి 25 ఏళ్లు అయింది. ఈ క్రమంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తమ ఉద్యోగులను ఉద్దేశించి ఓ బ్లాగ్ రాశారు. ఆ బ్లాగ్‌లో తన వ్యక్తిగత అనుభవాలతో పాటుగా గూగుల్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దాంట్లో తన వ్యక్తిగత అనుభవాలు సహా గూగుల్‌కు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకోవడం విశేషం. కొన్నేళ్ల కిందట తన తండ్రితో పిచాయ్.. ఎలా కమ్యూనికేట్ చేసేవారో కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు సుందర్ పిచాయ్. ఇప్పుడు తన పిల్లలు కూడా ఏదైనా సమాచారాన్ని క్షణాల్లోనే ఎలా బదిలీ చేయగలుగుతున్నారో వివరించారు. ఒకప్పుడు అలవాటు పడేందుకు ఏళ్లు పట్టిన టెక్నాలజీ.. ఇప్పటి పిల్లలు మాత్రం క్షణాల్లోనే ఆకళింపు చేసుకుంటున్నట్లు చెప్పారు. ఇక పిల్లలు ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ కథల్లా విన్నవే.. ఇప్పుడు వారి కళ్ల ముందు కదలాడుతున్నాయని పేర్కొన్నారు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.
ఆయన ఆ బ్లాగ్ రాస్తూ..’చాలా సంవత్సరాల క్రితం నేను అమెరికాలో చదువుతున్నప్పుడు భారత్‌లో ఉంటున్న మా నాన్నకు తొలి ఈ-మెయిల్ అడ్రస్ వచ్చింది. నా తండ్రితో కమ్యూనికేట్ చేయడానికి వేగవంతమైన, చవకైన మార్గం లభించినందుకు నేను చాలా సంతోషించాను. అందుకే నాన్నకి ఈ మెసేజ్ పంపాను. అప్పుడు నేను చాలా వెయిట్ చేశాను. ఆయన నుంచి సమాధానం రావడానికి నాకు 2 రోజులు పట్టింది. డియర్ పిచాయ్, ఈ-మెయిల్ అందుకున్నాను అని రాశారు.” అని బ్లాగ్‌లో పేర్కొన్నారు సుందర్ పిచార్. ఈ-మెయిల్ రావడం ఆలస్యం కావడంతో, పిచాయ్ తన తండ్రికి కూడా ఫోన్ చేశారు.
“ఇదిలా ఉంటే ఈ కాలంలో సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందింది. ఒకసారి నేను నా కొడుకుతో ఉన్నాను. ఏదో చూసి మొబైల్లో ఫోటో తీశాడు. ఆపై స్నేహితులకు షేర్ చేసుకున్నారు. తర్వాత ఒకరికొకరు మెసేజ్‌లు పంపుకున్నారు. జేబులోంచి ఫోన్ తీసినంత వేగంగా అదంతా జరిగింది. కొన్నేళ్ల క్రితం నేను నా తండ్రికి మెసేజ్ పంపిన తీరుతో పోలిస్తే, ఈ రోజు నా కొడుకు తన తండ్రితో సంభాషించే విధానం, తరాల మధ్య ఎంత మార్పు జరుగుతుందో చూపిస్తుంది.” అని బ్లాగ్ రాసుకొచ్చారు. అంటే ఆ కాలంలో టెక్నాలజీ, ఈ కాలంలో జరిగిన అభివృద్ధికి ఆయన తేడాను తెలిపారు.
కుప్పలు తెప్పలుగా ఉన్న సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఒక క్రమ పద్ధతిలో అందించాలన్న లారీ పేజ్, సెర్గీ బ్రిన్ ఆలోచనతోనే గూగుల్ మిషన్ ప్రారంభమైందని సుందర్ పిచాయ్ ఆ బ్లాగ్‌లో తెలిపారు. అలా గూగుల్ సెర్చ్ పేరుతో తీసుకొచ్చిన ప్రొడక్ట్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తే కోట్లాది మందికి పరిష్కారాలను వెతికి పెట్టిందని అన్నారు. సరైన సమాధానాలు వెతికిచ్చే గూగుల్ సామర్థ్యం చూసిన తాను ఆశ్చర్యపోయేవాడినని పాత రోజుల్ని గుర్తుచేసుకున్నారు. ‘నల్లా కారుతుంటే దానిని మరమ్మతు ఎలా చేయడం?’ అనే దాని దగ్గర నుంచి.. తాను ఉద్యోగం కోసం వెతుకుతున్న సమయంలో ‘గూగుల్ ఇంటర్వ్యూ ఎదుర్కోవడం ఎలా?’ అనే వరకు ఇలా ఎన్నో ప్రశ్నలకు గూగుల్ తనకు సమాధానం ఇచ్చిందని చెప్పారు పిచాయ్. సమయం గడుస్తున్న కొద్దీ తాను అడిగే ప్రశ్నల తీరుతో పాటు.. గూగుల్ ఆన్సర్ చేసే విధానంలో కూడా ఎన్నో మార్పులొచ్చాయని వివరించారు.
గూగుల్ ప్రస్తుతం ఒక సెర్చ్ బాక్స్ మాత్రమే కాదని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెప్పుకొచ్చారు. పదుల సంఖ్యలో గూగుల్ ప్రొడక్ట్స్ అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. రోజూ కోట్లాది మంది ఈ సేవలు వినియోగించుకుంటున్నట్లు వివరించారు. ఈ క్రమంలో వచ్చిన క్రోమ్, యూట్యూబ్‌లు జ్ఞాన సముపార్జనకు బలమైన వేదికలుగా మారాయని అన్నారు. టెక్నాలజీ రంగంలో క్లౌడ్ సంచలనం సృష్టించిందని చెప్పుకొచ్చారు. తమ ప్రయాణంలో ప్రతి దశలోనూ తమకు ఎన్నో సవాళ్లు ఎదురైనట్లు చెప్పుకొచ్చారు. గూగుల్వేవ్ విఫలం అయిందని అన్నారు. 2000ల్లో అసలు వెబ్బ్రౌజర్గా ఎన్నాళ్లు మనుగడ సాధిస్తామనే ప్రశ్న వచ్చిందన్నారు. ప్రతిసారి కూడా బలమైన సమాధానాలు, పరిష్కారాలతో యూజర్ల ముందుకు వచ్చామని.. కొత్త కొత్త విధానాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు.
ఎన్నో రకాల ప్రొడక్ట్స్ తీసుకురావడం ఒక ఎత్తు అయితే.. వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించడం అతిపెద్ద సవాలు అని సుందర్ పిచాయ్ అన్నారు. అందుకే గూగుల్ తొలినుంచీ బాధ్యతాయుతంగా వ్యవహరించిందని చెప్పుకొచ్చారు పిచాయ్. అందరి సమాచారం, గోప్యతకు భద్రత కల్పించడం తమ ప్రాధాన్యాంశంగా ఎంచుకున్నట్లు వివరించారు. ఇప్పుడు ఏఐని రానున్న పదేళ్లలో అందరికీ మరింత సహాయకారిగా మార్చడం, బాధ్యతాయుతంగా అమలు చేయడమే తమ ముందున్న లక్ష్యమని సుందర్ పిచాయ్ చెప్పారు.