Andhrapradesh: ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వద్ధ గల అల్పపీడనం ఈ రోజు బలహీనపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం దక్షిణ అంతర్గత ఒడిస్సా, సరిహద్దు ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి.. నైరుతి వైపు వంగి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు వాయవ్య బంగాళాఖాతం నుంచి తెలంగాణ వరకూ ఒక ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. కొన్నిచోట్ల ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే ఆస్కారం ఉంది. పిడుగులు పడే అవకాశం ఉండటంతో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.