Allahabad High Court: అలహాబాద్ హైకోర్టు మతమార్పిడిపై కీలక వ్యాఖ్యలు చేసింది. పవిత్ర బైబిల్ గ్రంథాన్ని పంచిపెట్టడం, మంచి బోధనలను అందించడం మతమార్పిడికి ఆకర్షితం చేయడం కాదని అలహాబాద్ హైకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. అపరిచిత వ్యక్తి ఈ చట్టంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేరని హైకోర్ట్ పేర్కొంది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వర్గాల ప్రజలను క్రైస్తవ మతంలోకి మార్చడానికి ప్రలోభపెట్టిన ఆరోపణల్లో ఇద్దరు నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు లక్నో బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.
జస్టిస్ షమీమ్ అహ్మద్ తో కూడి ధర్మాసనం జోస్ పాపచెన్, షీజా బెయిల్ పిటిషన్ తిరస్కరణపై అప్పీలుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 24న అంబేద్కర్ నగర్ జిల్లాలో బీజేపీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఇద్దర్ని జైలుకు పంపారు. ఈ ఇద్దరు మతమార్పుడులకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నాయకుడు ఆరోపించారు.
ఈ కేసులో న్యాయమూర్తి వ్యాఖ్యానిస్తూ.. బోధన అందించడం, పవిత్ర బైబిల్ పంపిణీ చేయడం, పిల్లలకు విద్యాభ్యాసాన్ని ప్రోత్సహించడం, గ్రామస్తులు సభలు నిర్వహించడం, గొడవలకు దిగొద్దని, మద్యం తీసుకోవద్దని గ్రామస్తులకు సూచించడం 2021 మతమార్పిడి చట్టం కిందకు రాదని పేర్కొన్నారు. ఈ విషయంలో బాధిత కుటుంబం మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. మరోవైపు ఇద్దరి తరుపున వాదించిన లాయర్..వారు నిర్దోషులని, రాజకీయ వైరం కారణంగా కేసులో చిక్కుకుపోయారని వాదించారు.